Sukumar: 'పుష్ప-3'పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన సుకుమార్

Sukumar Confirms Pushpa 3 at SIIMA 2025
  • దుబాయ్ లో సైమా అవార్డుల కార్యక్రమం 
  • పుష్ప-3 కచ్చితంగా ఉంటుందంటూ సుకుమార్ ప్రకటన
  • అల్లు అర్జున్ అభిమానుల్లో అంబరాన్నంటిన సంబరాలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పుష్ప 3’ చిత్రంపై దర్శకుడు సుకుమార్ పూర్తి స్పష్టతనిచ్చారు. ఈ సినిమా మూడో భాగం కచ్చితంగా ఉంటుందని ఆయన అధికారికంగా ప్రకటించారు. దుబాయ్ లో ఘనంగా జరిగిన సైమా 2025 అవార్డుల వేడుక ఈ కీలక ప్రకటనకు వేదికైంది. దీంతో ‘పుష్ప 3’పై కొంతకాలంగా నెలకొన్న అనుమానాలకు తెరపడినట్లయింది.

సైమా 2025 అవార్డుల ప్రదానోత్సవంలో ‘పుష్ప 2’ చిత్రం సత్తా చాటింది. అత్యధిక విభాగాల్లో నామినేషన్లు దక్కించుకున్న ఈ సినిమా ఏకంగా ఐదు అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక మందన్న, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్, ఉత్తమ గాయకుడిగా శంకర్ మహాదేవన్ అవార్డులు అందుకున్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ దర్శకుడి అవార్డును స్వీకరించిన అనంతరం సుకుమార్ మాట్లాడుతూ, అభిమానులకు అదిరిపోయే తీపి కబురు చెప్పారు. “పుష్ప 3 కచ్చితంగా ఉంటుంది” అని ఆయన వేదికపై నుంచి ప్రకటించడంతో అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గతంలో ‘పుష్ప 3: ది ర్యాంపేజ్’ పేరుతో ఓ పోస్టర్ బయటకు వచ్చినప్పటికీ, ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్‌లు లేకపోవడంతో ప్రాజెక్ట్‌పై సందేహాలు అలముకున్నాయి. అయితే, సుకుమార్ తాజా ప్రకటనతో ఆ ఊహాగానాలన్నింటికీ ఫుల్‌స్టాప్ పడింది. ఈ ప్రకటనతో పుష్ప ఫ్రాంచైజీ కొనసాగింపుపై పూర్తి భరోసా లభించినట్లయింది.
Sukumar
Pushpa 3
Allu Arjun
Pushpa The Rule
SIIMA Awards 2025
Rashmika Mandanna
Devi Sri Prasad
Telugu cinema
Indian movies

More Telugu News