Talari Lokendra: ధర్మవరంలో పట్టపగలే హత్య... తండ్రిని చంపిన రౌడీషీటర్ ను నరికి చంపిన కుమారుడు

Talari Lokendra Murdered in Dharmavaram Revenge Killing
  • ధర్మవరంలో పట్టపగలే రౌడీషీటర్ తలారి లోకేంద్ర దారుణ హత్య
  • బైక్‌పై వెళుతుండగా కారుతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో నరికివేత
  • గతంలో ఇద్దరిని హత్య చేసిన చరిత్ర ఉన్న లోకేంద్ర
సత్యసాయి జిల్లాలోని ధర్మవరం పట్టణం మరోసారి ఉలిక్కిపడింది. పాతకక్షల నేపథ్యంలో పట్టపగలే నడిరోడ్డుపై ఒక రౌడీషీటర్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తన తండ్రిని చంపిన వ్యక్తిపై కొడుకు పగ తీర్చుకున్న ఈ ఘటన, సినిమాలను తలపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తలారి లోకేంద్ర అనే రౌడీషీటర్‌ను కొందరు వ్యక్తులు కారులో వెంబడించి, బైక్‌ను ఢీకొట్టి కిందపడేశారు. ఆ తర్వాత వేట కొడవళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.

ధర్మవరానికి చెందిన తలారి లోకేంద్రపై గతంలో పలు కేసులు ఉన్నాయి. మాదకద్రవ్యాలకు బానిసైన ఇతను, కేవలం పది రూపాయల కోసం రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని హత్య చేశాడు. అంతేకాకుండా, ఓ మహిళను మద్యం తాగించి, వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసి, ఆమె నిరాకరించడంతో బండరాయితో మోది చంపాడు. ఈ కేసుల్లో జైలుకు వెళ్లిన లోకేంద్ర ఇటీవలే విడుదలయ్యాడు.

అయితే, తన తండ్రి రామకృష్ణారెడ్డిని చంపిన లోకేంద్రపై ప్రతీకారం తీర్చుకోవాలని అతని కుమారుడు బాలకృష్ణారెడ్డి చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. లోకేంద్ర జైలు నుంచి బయటకు రాగానే అతనిపై నిఘా పెట్టాడు. సరైన సమయం చూసి, తన స్నేహితులతో కలిసి పథకం ప్రకారం దాడి చేశాడు. 

బైక్‌పై వెళుతున్న లోకేంద్రను కారుతో వెంబడించి ఢీకొట్టారు. కింద పడిపోయిన అతడిని వేట కొడవళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు. ఈ హత్య దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.

హత్య అనంతరం బాలకృష్ణారెడ్డి, అతని స్నేహితులు నేరుగా ధర్మవరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో ధర్మవరంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Talari Lokendra
Dharmavaram
Rowdy sheeter murder
Balakrishna Reddy
Satya Sai district
Crime news
Revenge killing
Andhra Pradesh crime
Murder case
Ramakrishna Reddy

More Telugu News