కిమ్ ఫోన్ ట్యాపింగ్‌కు ట్రంప్ స్కెచ్.. ఉత్తర కొరియాలో అమెరికా సీక్రెట్ మిషన్ ఫెయిల్!

  • కింగ్ జాంగ్‌పై గూఢచర్యానికి ట్రంప్ రహస్య ప్రయత్నం
  • అమెరికా నేవీ సీల్స్ బృందానికి ఆపరేషన్ అప్పగింత 
  • 2019లో నిర్వహించిన ఈ సీక్రెట్ ఆపరేషన్ మధ్యలోనే విఫలం
  • మత్స్యకారులను చంపి వెనుదిరిగిన సీల్స్ బృందం
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌పై గూఢచర్యం చేసేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ రహస్య ప్రయత్నం దారుణంగా విఫలమైంది. 2019లో జరిగిన ఈ సీక్రెట్ ఆపరేషన్‌లో అమెరికా నేవీ సీల్స్ బృందం కొందరు ఉత్తర కొరియా పౌరులను హతమార్చి, లక్ష్యాన్ని పూర్తి చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ సంచలన విషయాలను న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది.

2019లో కిమ్‌తో అణు చర్చలు జరగడానికి ముందు ఆయన కమ్యూనికేషన్లను రహస్యంగా తెలుసుకునేందుకు ట్రంప్ యంత్రాంగం ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా కిమ్ ఫోన్ సంభాషణలను సైతం వినగలిగే ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉత్తర కొరియా భూభాగంలో అమర్చాలని భావించింది. ఈ బాధ్యతను అత్యంత నైపుణ్యం కలిగిన నేవీ సీల్ టీమ్ 6కు అప్పగించారు. నెలల తరబడి శిక్షణ పొంది, పక్కా ప్రణాళికతో ఈ ఆపరేషన్ ప్రారంభించారు.

అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలించలేదు. జలాంతర్గామి నుంచి మినీ సబ్‌మెరైన్ల ద్వారా తీరానికి చేరుకున్న సీల్స్ బృందానికి ఊహించని అవాంతరాలు ఎదురయ్యాయి. మొదట వారి మినీ సబ్‌మెరైన్ల సమన్వయం దెబ్బతింది. ఆ తర్వాత, వారికి రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ లేకపోవడం పెద్ద లోపంగా మారింది. తాము ఉన్న ప్రాంతంలో ఎవరూ లేరని భావించిన వారికి ఓ చిన్న చేపల పడవ కంటపడింది.

ఆ పడవలోని మత్స్యకారులు తమను గమనిస్తున్నారని, మిషన్ రహస్యం బయటపడిపోతుందని సీల్స్ బృందం ఆందోళన చెందింది. తమ ఆచూకీ బయటపడకముందే అప్రమత్తమైన సీల్స్.. ఆ మత్స్యకారులపై కాల్పులు జరిపి వారిని హతమార్చింది. నిబంధనల ప్రకారం ఎవరితోనైనా తలపడాల్సి వస్తే మిషన్‌ను వెంటనే ఆపేయాలి. దీంతో, వారు తమ లక్ష్యాన్ని అక్కడితో విరమించుకుని వెంటనే వెనుదిరిగారు.

ఈ ఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత 2019 జూన్‌లో ట్రంప్, కిమ్ మధ్య శిఖరాగ్ర చర్చలు జరిగాయి. కానీ, ఆ చర్చలు విఫలమవ్వడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి ఉత్తర కొరియా చర్చలకు దూరంగా ఉంటూ, తన అణ్వాయుధ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది.


More Telugu News