Narendra Modi: భారత న్యాయ వ్యవస్థలో సరికొత్త ప్రయోగం.. రంగంలోకి దిగుతున్న 'రోబో జడ్జిలు'!

Narendra Modi Government Introduces Robot Judges in Indian Legal System
  • న్యాయ వ్యవస్థలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశం
  • చిన్న నేరాలు, భూ వివాదాల్లో వేగంగా తీర్పులు ఇచ్చేందుకు సన్నాహాలు
  • జడ్జిలకు విదేశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం
  • కోట్లలో పేరుకుపోయిన కేసుల భారం తగ్గించడమే ప్రధాన లక్ష్యం
దేశంలోని న్యాయ వ్యవస్థలో పేరుకుపోయిన కోట్ల కొద్దీ కేసులకు పరిష్కారం చూపే దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. చిన్నపాటి నేరాలు, భూ వివాదాలు వంటి సాధారణ కేసుల్లో తీర్పులను వేగవంతం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది. 'రోబో జడ్జిలు'గా పిలుస్తున్న ఈ కొత్త విధానం, భారత న్యాయ వ్యవస్థ రూపురేఖలనే మార్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఏమిటీ 'రోబో జడ్జి' విధానం?
'రోబో జడ్జి' అంటే న్యాయమూర్తి స్థానంలో ఒక రోబో కూర్చుని తీర్పులు చెప్పడం కాదు. కేసులకు సంబంధించిన సమాచారం, పాత రికార్డులు, గతంలో వెలువడిన తీర్పులు వంటి వాటిని ఏఐ టెక్నాలజీ వేగంగా విశ్లేషిస్తుంది. ఈ సమాచారం ఆధారంగా న్యాయమూర్తులు త్వరితగతిన ఒక నిర్ణయానికి రావడానికి ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు, చిన్నపాటి దొంగతనాలు, భూ తగాదాలు వంటి కేసుల విచారణలో ఈ విధానాన్ని ఉపయోగించనున్నారు. దీని ప్రధాన ఉద్దేశం మానవ న్యాయమూర్తులను తొలగించడం కాదు, వారికి సహాయకారిగా ఉంటూ న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడమే.

విదేశాల్లో జడ్జిలకు ప్రత్యేక శిక్షణ
ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. జిల్లా, సెషన్స్ కోర్టుల న్యాయమూర్తులకు ఏఐ వాడకంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రెండు బృందాలుగా సుమారు 70 నుంచి 80 మంది ఐసీటీ (సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ) అధికారులు, న్యాయమూర్తులు సింగపూర్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఎస్టోనియా, చైనా వంటి దేశాల్లో విజయవంతమైన ఏఐ నమూనాలను అధ్యయనం చేసి, మన దేశ న్యాయ వ్యవస్థకు అనుగుణంగా ఒక స్వదేశీ వ్యవస్థను నిర్మించడం ఈ శిక్షణ లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) పర్యవేక్షిస్తోంది.

ఈ సంస్కరణ అవసరమా?
ప్రస్తుతం దేశంలోని దిగువ కోర్టుల్లో సుమారు 3.6 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ భారాన్ని తగ్గించేందుకు ఏఐ టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. పైలట్ ప్రాజెక్టులు చేపట్టిన ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో కేసుల విచారణ సమయం 30 శాతం వరకు మెరుగుపడినట్లు న్యాయశాఖ అధ్యయనంలో తేలింది. అదేవిధంగా, ఏఐ ఆధారిత డిజిటల్ వ్యవస్థలు వాడిన కోర్టుల్లో రెండేళ్లలో పెండింగ్ కేసులు 15-20 శాతం తగ్గినట్టు నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్‌జేడీజీ) నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నప్పుడు మనం వెనుకబడి ఉండలేమని, న్యాయ వ్యవస్థలో ఏఐ ప్రవేశం అనివార్యమని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో 'రోబో జడ్జి' అనేది కేవలం ఒక ఆలోచనగా కాకుండా, భారత న్యాయస్థానాల్లో వాస్తవరూపం దాల్చనుంది.
Narendra Modi
Indian Judiciary
Artificial Intelligence
AI in Law
Pending Cases
National Judicial Data Grid
IIPA
Robot Judges
Court Cases India
Justice System Reform

More Telugu News