Ajit Pawar: అజిత్ పవార్ తో ఐపీఎస్ వాగ్వాదం.. వీడియో ఇదిగో!

IPS Officer Argues with Ajit Pawar Over Illegal Mining
  • ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ఐపీఎస్ మహిళా అధికారి
  • ఉప్ ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు ఫోన్ చేసిన ఎన్సీపీ కార్యకర్తలు
  • వారిపై చర్యలు తీసుకోవద్దని అజిత్ పవార్ ఆదేశం
  • ఇదే విషయం వీడియో కాల్ లో చెప్పాలని కోరిన ఐపీఎస్
ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి వెళ్లిన ఓ ఐపీఎస్ అధికారిణికి ఏకంగా ఉపముఖ్యమంత్రి ఫోన్ చేయడం మహారాష్ట్రలో సంచలనంగా మారింది. అక్రమార్కులపై చర్యలు వద్దని ఫోన్ లో ఉప ముఖ్యమంత్రి ఆదేశించడంతో.. ఇదే విషయాన్ని వీడియో కాల్ లో చెప్పాలని సదరు ఐపీఎస్ అధికారిణి కోరారు. దీంతో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 
వివరాల్లోకి వెళితే.. 
సోలాపుర్‌ జిల్లాలోని కర్మలా తాలూకాలోని కుద్దు గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని సబ్-డివిజనల్ పోలీసు అధికారిణి, ఐపీఎస్ అంజనా కృష్ణకు ఫిర్యాదులు అందాయి. దీంతో సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లిన అంజనా కృష్ణ.. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు గ్రామస్థులు, స్థానిక ఎన్సీపీ కార్యకర్తలు అధికారులతో ఘర్షణకు దిగారు. వారిలో ఒకరు తమ పార్టీ అధినేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు ఫోన్ చేసి ఐపీఎస్ అంజనాకృష్ణకు ఇచ్చారు.

ఫోన్ లో ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ఆపాలని పవార్‌ ఆమెను ఆదేశించారు. అయితే, తాను ఫోన్ లో మాట్లాడుతున్నది ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తోనేనని రుజువు చేసుకోవాలని, తనకు వీడియో కాల్ చేయాలని అంజనీకృష్ణ కోరారు. దీంతో ఆగ్రహం చెందిన అజిత్ పవార్.. ‘నన్నే వీడియో కాల్ చేయమంటావా.. నీకు ఎంత ధైర్యం?. మీపై చర్యలు తీసుకుంటా. నన్ను చూడాలనుకుంటున్నారుగా.. నాకు వీడియో కాల్‌ చేయండి’ అంటూ నెంబర్ చెప్పి ఫోన్ పెట్టేశారు.

దీంతో పవార్‌కు ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ వీడియో కాల్‌ చేశారు. ఈ సందర్భంగా తక్షణమే చర్యలు ఆపేయాలంటూ పవార్‌ ఆదేశించారు. కాగా, ఈ వీడియో వైరల్ గా మారడంతో అజిత్ పవార్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఐపీఎస్ అధికారిణి విధులకు అడ్డుపడ్డారని, అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారని విమర్శిస్తున్నారు.

ఈ విమర్శలపై ఎన్సీపీ నేత సునీల్‌ తట్కరే స్పందిస్తూ.. పవార్‌ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. కార్యకర్తలను శాంతింపజేసేందుకు ఐపీఎస్ అధికారిణిని అజిత్ మందలించి ఉండవచ్చని అన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అజిత్ పవార్ మద్దతివ్వరని స్పష్టం చేశారు. ఈ వీడియోపై మాట్లాడేందుకు ఐపీఎస్‌ అధికారిణి అంజనా కృష్ణ నిరాకరించారు.
Ajit Pawar
Anjana Krishna
Maharashtra
IPS officer
Illegal sand mining
Solapur
NCP
Video call controversy
Corruption
Government interference

More Telugu News