Siddaramaiah: ముడా కేసులో సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట.. క్లీన్‌చిట్ ఇచ్చిన కమిషన్!

Siddaramaiah Gets Clean Chit in MUDA Case Commission Report
  • సిద్ధరామయ్య, ఆయన కుటుంబంపై ఆరోపణలు నిరాధారమని తేల్చిన కమిషన్
  • జస్టిస్ పీ.ఎన్.దేశాయ్ ఏకసభ్య కమిషన్ నివేదిక
  • నివేదికను ఆమోదించిన కర్ణాటక కేబినెట్
  • కొందరు ముడా అధికారులపై చర్యలకు సిఫార్సు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపుల కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయన, ఆయన కుటుంబ సభ్యులపైనా వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని జస్టిస్ పి.ఎన్.దేశాయ్ నేతృత్వంలోని ఏకసభ్య విచారణ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు కమిషన్ సమర్పించిన నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించినట్టు రాష్ట్ర న్యాయ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్.కె.పాటిల్ వెల్లడించారు.

నిన్న జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం విధానసౌధలో మీడియాతో మాట్లాడిన మంత్రి పాటిల్ ఈ వివరాలను వెల్లడించారు. "జస్టిస్ పి.ఎన్. దేశాయ్ కమిషన్ రెండు భాగాలుగా తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ముడా కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని కమిషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ నివేదికను యథాతథంగా ఆమోదించింది" అని ఆయన వివరించారు.

ముడా అక్రమంగా 14 స్థలాలను సీఎం కుటుంబానికి కేటాయించిందనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో సిద్ధరామయ్యను ప్రధాన నిందితుడిగా, ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జునస్వామిని ఇతర నిందితులుగా పేర్కొన్నారు. గతంలో కర్ణాటక లోకాయుక్త కూడా సరైన ఆధారాలు లేవని ఈ కేసులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

డీ-నోటిఫై చేసిన భూములను ముడా వినియోగించుకున్నందుకు పరిహారంగానే భూ యజమానులకు నిబంధనల ప్రకారం స్థలాలు కేటాయించారని, ఈ ప్రక్రియలో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే, మరోవైపు కొందరు ముడా అధికారుల పనితీరుపై కమిషన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2020 నుంచి 2024 మధ్య పనిచేసిన కొంతమంది కమిషనర్లు నిబంధనలకు విరుద్ధంగా, తమకు ఇష్టమొచ్చినట్లు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించారని పేర్కొంది. ఈ అక్రమాలపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
Siddaramaiah
Karnataka
MUDA
Mysore Urban Development Authority
Land allocation case
Justice PN Desai Commission
Corruption allegations
Karnataka Cabinet
H.K. Patil
Clean chit

More Telugu News