Gutta Venkateswarlu: ముగ్గురు చిన్నారుల మిస్సింగ్ మిస్టరీ వీడింది.. వారిని చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

Father Suicide After Killing Three Children in Andhra Pradesh
  • భార్యతో గొడవపడి ముగ్గురు పిల్లలను చంపేసిన తండ్రి
  • పిల్లలకు పురుగుల మందు తాగించి హత్య, ఆపై దహనం
  • అనంతరం తండ్రి వెంకటేశ్వర్లు కూడా ఆత్మహత్య
  • నాగర్‌కర్నూలు జిల్లాలో వెలుగుచూసిన దారుణ ఘటన
  • వేర్వేరు ప్రాంతాల్లో లభ్యమైన చిన్నారుల మృతదేహాలు
  • సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు
కుటుంబ కలహాలు ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. కన్నతండ్రే తన ముగ్గురు పిల్లలను కర్కశంగా హతమార్చి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక ఘటన నాగర్‌కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిల్లల మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్దబోయపల్లికి చెందిన గుత్త వెంకటేశ్వర్లు (38) పన్నెండేళ్ల క్రితం తన మేనమామ కూతురైన దీపికను వివాహం చేసుకున్నాడు. వీరికి మోక్షిత (8), వర్షిణి (6) అనే ఇద్దరు కుమార్తెలు, శివధర్మ (4) అనే కుమారుడు ఉన్నారు. గత నెల 30న భార్యతో గొడవపడిన వెంకటేశ్వర్లు, ముగ్గురు పిల్లలను తన బైక్‌పై ఎక్కించుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన దీపిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వెంకటేశ్వర్లు శ్రీశైలం మీదుగా నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట వరకు ప్రయాణించినట్టు గుర్తించారు. ప్రయాణ మార్గంలో అతని బైక్‌పై ఉన్న పిల్లల సంఖ్య ఒక్కొక్కరిగా తగ్గుతూ రావడం పోలీసులకు అనుమానం కలిగించింది. మొదట ముగ్గురు పిల్లలతో కనిపించిన వెంకటేశ్వర్లు, చారకొండ మండలం జూపల్లి వద్దకు వచ్చేసరికి పెద్ద కుమార్తె మోక్షితతో మాత్రమే ఉన్నాడు. ఆ తర్వాత కల్వకుర్తి పట్టణానికి ఒంటరిగా చేరుకున్నట్టు నిర్ధారించారు.

ఈ క్రమంలో బుధవారం వెల్దండ మండలం పెద్దాపూర్‌ వద్ద వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు. దీంతో పిల్లల కోసం గాలింపు ముమ్మరం చేయగా, గురువారం ఉప్పునుంతల మండలం సూరాపూర్‌ తండా వద్ద వర్షిణి, శివధర్మల మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో పెద్ద కుమార్తె మోక్షిత మృతదేహం కూడా కాలిపోయిన స్థితిలో దొరికింది.

వెంకటేశ్వర్లు ఒక్కో బిడ్డను ఒక్కోచోట పురుగుల మందు తాగించి చంపి, ఆ తర్వాత పెట్రోల్ పోసి దహనం చేసి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.
Gutta Venkateswarlu
Nagarkurnool
family disputes
child murder
suicide
crime news
Andhra Pradesh
Achampet
Kalwakurthy
poison

More Telugu News