Madras High Court: భార్య సంపాదన ఎక్కువైతే భర్త భరణం ఇవ్వక్కర్లేదు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Madras High Court says husband need not pay alimony if wife earns more
  • వైద్య దంపతుల విడాకుల కేసులో కీలక పరిణామం
  • నెలకి రూ.30 వేలు భరణం ఇవ్వాలన్న ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వుల రద్దు
  • భార్యకు ఆస్తులు, సొంతంగా స్కానింగ్ సెంటర్ ఉన్నట్టు కోర్టు గుర్తింపు
  • కొడుకు చదువు ఖర్చులకు మాత్రం భర్త అంగీకారం
భార్యాభర్తల మధ్య భరణం చెల్లింపు కేసులకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. భార్యకు భర్త కన్నా ఎక్కువ ఆదాయం, ఆస్తులు ఉన్నప్పుడు ఆమెకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. చెన్నైకి చెందిన వైద్య దంపతుల కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.

చెన్నైలో వైద్యులుగా పనిచేస్తున్న భార్యాభర్తలు విభేదాల కారణంగా విడిపోయారు. విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు భార్యకు నెలకు రూ.30,000 చొప్పున భరణంగా చెల్లించాలని భర్తను ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సదరు వైద్యుడు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్ బాలాజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా తన భార్యకు ఇప్పటికే గణనీయమైన ఆస్తులు ఉన్నాయని, ఆమె సొంతంగా ఒక స్కానింగ్ సెంటర్ నడుపుతూ అధిక ఆదాయం సంపాదిస్తోందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఆధారాలను, పత్రాలను కూడా సమర్పించారు. వాదనలు విన్న న్యాయస్థానం, భార్య ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు భర్త నుంచి భరణం ఆశించడం సరికాదని అభిప్రాయపడింది.

అదే సమయంలో, వారి కుమారుడు 'నీట్' పరీక్షకు సిద్ధమవుతున్నాడని, అతని చదువుకు అయ్యే ఖర్చు రూ.2.77 లక్షలను తాను భరించేందుకు సిద్ధంగా ఉన్నానని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, కుమారుడి చదువు ఖర్చుల విషయంలో జోక్యం చేసుకోబోమని పేర్కొంది. భార్యకు భరణం చెల్లించాలంటూ ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను పూర్తిగా రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.
Madras High Court
maintenance
alimony
divorce case
chennai
family court
justice balaji
neet exam
income assets

More Telugu News