Vangalapudi Anitha: డ్రగ్స్ మాఫియాపై ఏపీ సర్కార్ యుద్ధం.. కీలక ఆదేశాలు జారీ

AP Government Issues Key Orders on Drugs Mafia Control
  • హోంమంత్రి అనిత అధ్యక్షతన ఉపసంఘం భేటీ
  • హాజరైన నారా లోకేశ్, కొల్లు రవీంద్ర తదితర మంత్రులు
  • డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఈగల్ బృందం సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు హాజరు
రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. స్మగ్లర్ల నెట్ వర్క్ పై ఉక్కుపాదం మోపడంతో పాటు, వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలకు ఉపక్రమించింది.

ఉండవల్లిలో గురువారం హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ భేటీలో మంత్రులు నారా లోకేశ్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, గుమ్మిడి సంధ్యారాణి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఈగల్ బృందం సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడికి ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

గంజాయి సాగును అరికట్టేందుకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ఉపసంఘం సూచించింది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో సాగవుతున్న గంజాయిని గుర్తించేందుకు డ్రోన్లు, శాటిలైట్ చిత్రాలను ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఈ చిత్రాలను విశ్లేషించి, సాగు జరుగుతున్న ప్రాంతాలను కచ్చితంగా గుర్తించాలని ఆదేశించింది. అలాగే, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని సరిహద్దుల్లో రవాణాను పూర్తిగా నిరోధించాలని పేర్కొంది.

మాదకద్రవ్యాల నియంత్రణలో సమాచార విశ్లేషణ అత్యంత కీలకమని ఉపసంఘం అభిప్రాయపడింది. క్షేత్రస్థాయి సమాచారం, కేసుల పురోగతి, నిఘా వర్గాల నివేదికలు, డ్రోన్ చిత్రాల విశ్లేషణ వంటి అన్ని అంశాలను ఒకేచోట పర్యవేక్షించేందుకు ఆర్టీజీఎస్ ద్వారా ఒక ప్రత్యేక డ్యాష్ బోర్డును రూపొందించాలని ఆదేశించింది. హాట్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ప్రజల నుంచి సమాచారం సేకరించి, కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

యువతను డ్రగ్స్ బారి నుంచి కాపాడేందుకు విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఉపసంఘం ఆదేశించింది. ప్రతి నెలా ఒక శనివారం 'ఈగల్ క్లబ్స్' ద్వారా గంజాయి దుష్పరిణామాలపై విద్యార్థులకు వివరించాలని తెలిపింది. మరోవైపు, అమాయక గిరిజనులను గంజాయి సాగుకు పావులుగా వాడుకుంటున్నారని, ఐటీడీఏల ద్వారా వారికి అవగాహన కల్పించాలని సూచించింది. డ్రగ్స్ కు బానిసలైన వారిని బయటకు తీసుకువచ్చేందుకు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డి-అడిక్షన్ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని, దీనికోసం స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చూడాలని, చార్జిషీట్లను సకాలంలో దాఖలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులకు దిశానిర్దేశం చేసింది.
Vangalapudi Anitha
Andhra Pradesh
drugs mafia
ganja control
narcotics control
AP government
drug trafficking
crime control
drones
artificial intelligence

More Telugu News