IMD: ఐఎండీ అలర్ట్... కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

IMD Alert Heavy Rain Forecast for Coastal Andhra
  • బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం
  • ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో విస్తారంగా కురవనున్న వర్షాలు
  • హిమాచల్, ఉత్తరాఖండ్‌లో రెడ్ అలర్ట్ జారీ
  • ఢిల్లీలో యమునా ఉగ్రరూపం.. జనజీవనం స్తంభనం
  • కొండ ప్రాంతాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచన
కోస్తాంధ్ర, తెలంగాణతో పాటు పలు దక్షిణ భారత రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారనుందని, తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఐఎండీ గురువారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, కోస్తాంధ్ర, తెలంగాణ, దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌తో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో కొంకణ్, గోవా, మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాలు, కోస్తా కర్ణాటకలో సెప్టెంబర్ 7 వరకు అతి భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మరోవైపు, దేశంలోని ఉత్తర, మధ్య భారతంలోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, గుజరాత్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాల కారణంగా వరదలతో పాటు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పర్యాటకులు కొండ ప్రాంతాలకు ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

దేశ రాజధాని ఢిల్లీని సైతం భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నది నీటిమట్టం 207 మీటర్ల మార్కును దాటడంతో ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్‌లు ప్రకటించారు. వరదల కారణంగా ట్రాఫిక్ జామ్‌లు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడి జనజీవనం స్తంభించింది. 

ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వారం రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని, వాతావరణ శాఖ సందేశాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు.
IMD
India Meteorological Department
Andhra Pradesh rains
Telangana rains
South India weather
Heavy rainfall alert
Weather forecast
Red alert
Orange alert
Yamuna River

More Telugu News