Chandrababu Naidu: చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయం.. ఇకపై రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం!

Chandrababu Cabinet Approves Free Medical Treatment up to 25 Lakhs
  • యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం
  • ప్రతి కుటుంబానికి ఏటా రూ. 25 లక్షల ఆరోగ్య బీమా
  • రాష్ట్రవ్యాప్తంగా 1.63 కోట్ల కుటుంబాలకు లబ్ధి
  • ఆరు గంటల్లోనే వైద్య చికిత్సకు అనుమతులు
  • 2,493 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు
  • మొత్తం 3,257 రకాల చికిత్సలు అందుబాటులోకి
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య భద్రత దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏటా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే 'యూనివర్సల్ హెల్త్ పాలసీ'కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

'ఆయుష్మాన్ భారత్ - ఎన్టీఆర్ వైద్య సేవ' పథకం కింద ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని అర్హులైన సుమారు కోటి 63 లక్షల కుటుంబాలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. అత్యవసర సమయాల్లో వైద్యం కోసం పేద, మధ్యతరగతి ప్రజలు అప్పులపాలు కాకుండా చూసేందుకు ఈ పథకం దోహదపడనుంది.

ఈ పథకం అమలులో వేగం, పారదర్శకతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. వైద్య చికిత్సలకు కేవలం 6 గంటల్లోనే అనుమతులు మంజూరు చేసేలా ప్రత్యేకంగా 'ప్రీ ఆథరైజేషన్ మేనేజ్‌మెంట్' వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 2,493 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. హైబ్రిడ్ విధానంలో మొత్తం 3,257 రకాల చికిత్సలను ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు.

ఈ పాలసీ ప్రకారం, రూ. 2.5 లక్షల లోపు వైద్య చికిత్సల క్లెయిమ్‌లను ఇన్సూరెన్స్ కంపెనీలు పర్యవేక్షిస్తాయి. రూ. 2.5 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు అయ్యే భారీ వైద్య ఖర్చులను ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో మంత్రులతో చర్చించిన అనంతరం సీఎం చంద్రబాబు ఈ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
Universal Health Policy
Ayushman Bharat
NTR Vaidya Seva
Free Medical Treatment
Health Insurance
Medical Scheme
AP Cabinet Decisions
Healthcare

More Telugu News