Revanth Reddy: కామారెడ్డిలో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy Conducts Aerial Survey in Kamareddy Flood Areas
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
  • వరద నష్టంపై కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి సమీక్ష
  • మరమ్మతులు, నిర్మాణాలు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలన్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయన వెంట టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయడంతో పాటు బాధితులతో ఆయన మాట్లాడారు.

వరద నష్టంపై కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా ఎంత నష్టం జరిగింది, ఎన్ని నిధులు అవసరమో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మరమ్మతులు, నిర్మాణాలు తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉంటేనే వరద నష్టాలను తగ్గించగలమని ముఖ్యమంత్రి అన్నారు. ఎవరికి వారు ఉంటామంటే క్రైసిస్ మేనేజ్‌మెంట్ చేయలేమని ఆయన స్పష్టం చేశారు. ఎరువుల పంపిణీలో సమన్వయం లోపం వల్లే సమస్యలు వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

యూరియా పంపిణీలో ముందుగా రైతులకు టోకెన్లు ఇచ్చి గందరగోళం లేకుండా చూడాలని సూచించారు. సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమస్యలపై 15 రోజుల తర్వాత మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Revanth Reddy
Telangana floods
Kamareddy
Aerial survey
Ponguleti Srinivas Reddy
TPCC Chief Mahesh Kumar Goud

More Telugu News