Jamshedpur: జంషెడ్‌పూర్‌లో... 24 గంటల్లో రెండు భారీ దోపిడీలు!

Jamshedpur Hit by Robberies Two Major Incidents in 24 Hours
  • వ్యాపారి కళ్లలో కారం చల్లి రూ.30 లక్షల నగదు అపహరణ
  • అడ్డుకోబోతే గాల్లోకి కాల్పులు జరిపిన దుండగులు
  • అంతకుముందు రోజే నగల దుకాణంలో లక్షల విలువైన ఆభరణాల లూటీ
  • వరుస ఘటనలతో నగరవాసులు, వ్యాపారుల్లో తీవ్ర భయాందోళన
జార్ఖండ్‌లోని పారిశ్రామిక నగరం జంషెడ్‌పూర్‌లో వరుస దోపిడీలు కలకలం రేపుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో రెండు భారీ దోపిడీలు జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గురువారం మధ్యాహ్నం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక వ్యాపారి నుంచి రూ.30 లక్షల నగదును దుండగులు అపహరించుకుపోయారు.

సాకేత్ అగర్వాల్ అనే వ్యాపారి బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తన స్కూటర్‌పై రూ.30 లక్షల నగదుతో బయలుదేరారు. బిస్తుపూర్ గురుద్వారా ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అతడిని అడ్డగించారు. వెంటనే సాకేత్ కళ్లలో కారం చల్లి, అతని వద్ద ఉన్న డబ్బు సంచిని లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించారు. కళ్లు కనపడకపోయినా సాకేత్ వారిని వెంబడించే ప్రయత్నం చేయగా దుండగులు గాల్లోకి కాల్పులు జరిపి అక్కడి నుంచి ఒక ఎస్‌యూవీలో పరారయ్యారు. ఈ ఘటనలో సాకేత్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ దోపిడీ జరిగిన ప్రదేశం జంషెడ్‌పూర్ ఎంపీ బిద్యుత్ బరన్ మహతో నివాసానికి సమీపంలో ఉండటం గమనార్హం. పట్టపగలే జరిగిన ఈ ఘటనతో స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వారు ఆరోపిస్తున్నారు.

బుధవారం కూడా సోనారి పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్ధమాన్ జ్యువెలర్స్‌లో ఆరుగురు సాయుధ దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. వినియోగదారుల రూపంలో దుకాణంలోకి ప్రవేశించి, యజమాని పంకజ్ జైన్‌ను తుపాకీతో బెదిరించి బంధించారు. ఆయన ప్రతిఘటించడంతో పిస్టల్ బట్‌తో తలపై తీవ్రంగా కొట్టారు. అనంతరం లక్షల రూపాయల విలువైన నగలను దోచుకుని, మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి పరారయ్యారు. వరుసగా రద్దీ ప్రాంతాల్లోనే దోపిడీలు జరగడంతో నగరంలో భయాందోళన వాతావరణం నెలకొంది.
Jamshedpur
Saket Agarwal
Jamshedpur robbery
Jharkhand crime
Bistupur
Pankaj Jain

More Telugu News