Nara Lokesh: ప్రద్యుమ్నతో నారా లోకేశ్ కు సంబంధాలున్నాయి: సజ్జల

Nara Lokesh Has Connections With Pradyumna Says Sajjala
  • ఏపీ లిక్కర్ స్కాంలో లోకేశ్ పై సజ్జల తీవ్ర ఆరోపణలు
  • బ్యాంక్ ఖాతా లేని భీమ్ కంపెనీతో లావాదేవీలు ఎలా సాధ్యం? అని ప్రశ్న
  • సిట్ పేరు అడ్డం పెట్టుకుని టీడీపీ, ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నాయని విమర్శలు
ఏపీ లిక్కర్ స్కాం వ్యవహారంలో మంత్రి నారా లోకేశ్ కు సంబంధాలున్నాయంటూ వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో ప్రచారంలో ఉన్న ప్రద్యుమ్న అనే వ్యక్తికి లోకేశ్ తో సంబంధాలున్నాయని, గతంలో లోకేష్ 'స్టూడియో-ఎన్' ఛానెల్‌ను ప్రమోట్ చేశారని ఆయన వెల్లడించారు. స్టూడియో-ఎన్ చానల్లో గతంలో ప్రద్యుమ్న క్రియాశీలక డైరెక్టర్ గా వ్యవహరించాడని తెలిపారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

లిక్కర్ స్కాంలో తమ వారిపై వస్తున్న ఆరోపణలను సజ్జల తీవ్రంగా ఖండించారు. యాక్టివిటీ లేని భీమ్ కంపెనీకి అసలు బ్యాంక్ ఖాతానే లేదని, అలాంటి కంపెనీ ద్వారా లావాదేవీలు ఎలా జరుగుతాయని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు లేని స్కామ్‌ను సృష్టించి, ప్రజల్లో విషం నింపేందుకు కట్టుకథలు అల్లుతున్నారని విమర్శించారు. సిట్ పేరుతో టీడీపీ, ఎల్లో మీడియా కలిసి కుట్రలు పన్నుతున్నాయని, తమ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ అత్యంత పారదర్శకంగా ఉండేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని రైతుల సమస్యలపైనా సజ్జల స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ల విషయంలో కూడా లంచాలు వసూలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

చంద్రబాబు, లోకేశ్ ఫేక్ వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి విష ప్రచారానికే పరిమితమయ్యారని సజ్జల విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్‌డీవో కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.
Nara Lokesh
Andhra Pradesh
Liquor Scam
Sajjala Ramakrishna Reddy
Studio N
YSRCP
Chandrababu Naidu
AP Politics
TDP
Kuppam

More Telugu News