Nirmala Sitharaman: సిగరెట్లు ప్రియం, బీడీలు చౌక.. కారణం ఇదే!

Cigarettes expensive bidis cheaper reason why
  • సిగరెట్లు, గుట్కాలపై జీఎస్టీ 40 శాతానికి పెంపు
  • బీడీలపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింపు
  • బీడీలు చుట్టే ఆకుపై పన్ను 5 శాతానికి కుదింపు
  • 70 లక్షల మంది కార్మికుల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయమన్న వాదన
  • ప్రభుత్వ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
పొగాకు వాడకాన్ని నియంత్రించాలని ఒకవైపు ప్రచారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, మరోవైపు సామాన్యులు ఎక్కువగా వినియోగించే బీడీలపై పన్ను తగ్గించి ఆశ్చర్యపరిచింది. సిగరెట్లు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనుండగా, బీడీల ధరలు మాత్రం తగ్గనున్నాయి. నిన్న ప్రకటించిన కొత్త జీఎస్టీ సంస్కరణలు ఈ విరుద్ధమైన పరిస్థితికి దారితీశాయి.

ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రకారం, బీడీలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. బీడీల తయారీలో ఉపయోగించే ఆకులపై పన్నును కూడా 18 శాతం నుంచి 5 శాతానికి కుదించారు. దీనికి పూర్తి భిన్నంగా, సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని 28 శాతం నుంచి ఏకంగా 40 శాతానికి పెంచారు. దీంతో వాటి ధరలు సామాన్యులకు మరింత భారం కానున్నాయి.

దేశవ్యాప్తంగా బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 70 లక్షల మంది కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన స్వదేశీ జాగరణ్ మంచ్ కూడా బీడీలపై అధిక జీఎస్టీని తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేసింది. అధిక పన్నుల కారణంగా బీడీ పరిశ్రమ, దానిపై ఆధారపడిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తమ లేఖలో పేర్కొన్నారు.

అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. "సిగరెట్లు ఆరోగ్యానికి హానికరం, మరి బీడీలు కాదా?" అంటూ నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సిగరెట్ల కన్నా బీడీలే ఎక్కువ ప్రమాదకరమని, వాటివల్ల పేద ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే, రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ కోణంలో విశ్లేషిస్తున్నారు.

కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. అయితే, కాంపెన్సేషన్ సెస్ ఖాతా కింద ఉన్న పాత రుణ బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు పాత ధరలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. 
Nirmala Sitharaman
GST
GST rates
bidi industry
cigarette prices
tobacco products
pan masala
gutka
tax reduction
social media

More Telugu News