Shoban Babu: ఆ ఒక్క సలహాయే శోభన్ బాబుని వేల కోట్లకు అధిపతిని చేసింది: ఎంపీ రఘురామ కృష్ణరాజు

Raghu Rama reveals the secret to Shoban Babus wealth
  • శోభన్ బాబు ఆస్తులపై ఎంపీ రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు
  • ఆయన ఆస్తుల ప్రస్తుత విలువ రూ. 4000 నుంచి 5000 కోట్లు ఉండొచ్చని అంచనా
  • సంపాదించిన ప్రతీ పైసా భూమి మీదే పెట్టుబడి పెట్టమని తండ్రి చెప్పిన మాట వల్లే ఇది సాధ్యమైందని వెల్లడి 
  • క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి, వ్యసనాలకు పూర్తిగా దూరంగా వున్నారని కితాబు 
  • కుటుంబ సభ్యులను సినిమా వాతావరణానికి దూరంగా ఉంచారని వ్యాఖ్య  
తెలుగు సినీ పరిశ్రమలో ‘అందాల నటుడు’గా, ‘సోగ్గాడు’గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు శోభన్ బాబు గురించి ఎవరికీ తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలను ఎంపీ రఘురామ కృష్ణరాజు పంచుకున్నారు. శోభన్ బాబుతో తనకున్న సన్నిహిత సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన వేల కోట్ల రూపాయల సంపదకు వెనుక ఉన్న  రహస్యాన్ని వెల్లడించారు. శోభన్ బాబు ఆస్తుల ప్రస్తుత విలువ సుమారు రూ. 4000 కోట్ల నుంచి రూ. 5000 కోట్ల వరకు ఉండవచ్చని ఆయన అంచనా వేశారు.

శోభన్ బాబు ఇంతటి ఆర్థిక క్రమశిక్షణతో ఉండటానికి, వేల కోట్ల ఆస్తులు కూడబెట్టడానికి కారణం వారి తండ్రి చెప్పిన ఒకే ఒక్క మాట అని రఘురామ వివరించారు. "భూమి స్థిరంగా ఉంటుంది, జనాభా మాత్రం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి సంపాదించిన ప్రతీ రూపాయిని భూమి మీదే పెట్టు" అని ఆయన తండ్రి చెప్పిన సలహాను శోభన్ బాబు తు.చ. తప్పకుండా పాటించారని తెలిపారు. తన కెరీర్ ఆరంభంలో పదివేల రూపాయల పారితోషికం తీసుకునే రోజుల్లో కూడా, మరో సినిమా అడ్వాన్స్ తీసుకొని మరీ భూములు కొనేవారని రఘురామ తెలిపారు. ఆ పెట్టుబడి సూత్రమే ఆయనను వేల కోట్లకు అధిపతిని చేసిందని స్పష్టం చేశారు. మురళీ మోహన్ వంటి నటులు కూడా శోభన్ బాబు సలహాతోనే స్థిరాస్తి రంగంలో విజయవంతమయ్యారని అన్నారు.

శోభన్ బాబు తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలను ఎప్పుడూ వేరుగానే చూశారని రఘురామ తెలిపారు. సినిమా వాతావరణం తమ కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతో వారిని పరిశ్రమకు పూర్తిగా దూరంగా ఉంచారని చెప్పారు. ఇంట్లో కనీసం ఒక్క సినిమా మ్యాగజైన్ కూడా ఉండేది కాదని, తన పిల్లలను కూడా సినిమాల్లోకి తీసుకురావాలనే ఆలోచన కూడా చేయలేదని అన్నారు. క్రమశిక్షణకు ఆయన పెట్టింది పేరని, ఎలాంటి దురలవాట్లు లేకుండా ఎంతో నిబద్ధతతో జీవించారని కొనియాడారు. నటుడు హరనాథ్ అందం, అభినయం చూసి తాను భయపడ్డానని, కానీ ఆయన వ్యసనాల కారణంగా కెరీర్‌ను ఎలా పాడుచేసుకున్నారో చూశాకే తాను మరింత జాగ్రత్తపడ్డానని శోభన్ బాబు తనతో చెప్పినట్లు రఘురామ వెల్లడించారు.

బయటకు పిసినారి అనే పేరు ఉన్నప్పటికీ, శోభన్ బాబు ఎవరికీ తెలియకుండా ఎన్నో గుప్తదానాలు చేసేవారని రఘురామ అన్నారు. ఇక దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అంటే శోభన్ బాబుకు అమితమైన గౌరవం ఉండేదని తెలిపారు. తన కెరీర్ తొలినాళ్లలో ఎన్టీఆర్ ఎంతో ప్రోత్సహించారని, ఎన్నో సినిమాలలో అవకాశాలు ఇప్పించారని శోభన్ బాబు చెప్పేవారని ఆయన గుర్తుచేసుకున్నారు.
Shoban Babu
Raghu Rama Krishnam Raju
Telugu cinema
real estate investment
land investment
NTR
financial discipline
Tollywood
Murali Mohan
Haranaath

More Telugu News