Shilpa Shetty: ‘బాస్టియన్’ మూసివేతపై శిల్పాశెట్టి క్లారిటీ.. అసలు విషయం ఇదీ!

Shilpa Shetty Clarifies Bastian Closure Rumors
  • 'బాస్టియన్' రెస్టరంట్ మూసివేత వార్తలపై నటి శిల్పాశెట్టి స్పష్టీకరణ 
  • రెస్టారెంట్‌ను శాశ్వతంగా మూసివేయడం లేదని వెల్లడి
  • ముంబై బాంద్రాలోని బ్రాంచ్‌కు మాత్రమే ముగింపు పలుకుతున్నట్లు ప్రకటన
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి చెందిన ప్రఖ్యాత రెస్టారెంట్ ‘బాస్టియన్’ మూతపడుతోందంటూ నిన్న ఒక్కసారిగా వార్తలు వైరల్ అయ్యాయి. స్వయంగా శిల్పాశెట్టి చేసిన ఒక పోస్ట్ ఈ ప్రచారానికి కారణమైంది. అయితే, ఈ వార్తలపై తాజాగా ఆమె పూర్తి స్పష్టత నిచ్చారు. తన రెస్టారెంట్‌ను శాశ్వతంగా మూసివేయడం లేదని, కేవలం ఒక కొత్త రూపంలో ప్రజల ముందుకు తీసుకువస్తున్నానని తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. ముంబైలోని బాంద్రాలో ఎంతో ప్రాచుర్యం పొందిన తన ‘బాస్టియన్’ రెస్టారెంట్‌కు ముగింపు పలుకుతున్నట్లు శిల్పాశెట్టి సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇది ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చిందని, గురువారం చివరి వేడుక నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొనడంతో, రెస్టారెంట్ పూర్తిగా మూతపడుతోందని అందరూ భావించారు. ఈ వార్త తెలియగానే వేల సంఖ్యలో తనకు ఫోన్లు వచ్చాయని శిల్ప తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆమె మరో ప్రకటన విడుదల చేశారు. "బాస్టియన్‌పై ప్రజలు చూపుతున్న ప్రేమ చూసి చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ఒక హామీ ఇస్తున్నాను, నేను రెస్టారెంట్‌ను పూర్తిగా మూసివేయడం లేదు. మేం కేవలం ఒక అధ్యాయాన్ని ముగించి, కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం" అని ఆమె వివరించారు.

బాంద్రాలోని రెస్టారెంట్ స్థానంలో, జుహు ప్రాంతంలో ‘బాస్టియన్ బీచ్ క్లబ్’ పేరుతో సరికొత్తగా ప్రారంభిస్తున్నట్లు శిల్ప వెల్లడించారు. ఈ కొత్త రెస్టారెంట్‌లో దక్షిణ భారతదేశానికి చెందిన ప్రత్యేకమైన మంగళూరు వంటకాలను పరిచయం చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌లో ఈ కొత్త బ్రాంచ్‌ను ప్రారంభిస్తామని, ఎన్ని బ్రాంచ్‌లు వచ్చినా బాంద్రాలోని రెస్టారంటే వాటికి మూలమని, అది ఎప్పటికీ ప్రత్యేకమేనని ఆమె పేర్కొన్నారు. శిల్పాశెట్టి ఇచ్చిన ఈ స్పష్టతతో ‘బాస్టియన్’ మూసివేతపై వస్తున్న పుకార్లకు తెరపడినట్లయింది.
Shilpa Shetty
Bastian restaurant
Mumbai restaurants
Bastian Beach Club
Mangalore cuisine
Indian restaurants
Bollywood actress
restaurant closure
restaurant revamp
Juhu restaurant

More Telugu News