Gannavaram Airport: విజయవాడ – బెంగళూరు విమానానికి తప్పిన పెను ప్రమాదం

Vijayawada Bengaluru Flight Safe Landing After Bird Hi
  • టేకాఫ్ సమయంలో విమానాన్ని ఢీకొట్టిన పక్షి
  • వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించిన పైలట్
  • సురక్షితంగా బయటపడ్డ 100 మంది ప్రయాణికులు
గన్నవరం విమానాశ్రయంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. విజయవాడ నుంచి బెంగళూరుకు బయలుదేరిన విమానాన్ని టేకాఫ్ సమయంలో పక్షి ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, పైలట్ సకాలంలో అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించడంతో 100 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

వివరాల్లోకి వెళితే, గన్నవరం విమానాశ్రయం నుంచి ఓ విమానం 100 మంది ప్రయాణికులతో బెంగళూరుకు బయలుదేరింది. విమానం రన్‌వేపై నుంచి గాల్లోకి లేస్తున్న సమయంలో ఓ పక్షి వేగంగా వచ్చి విమానం రెక్కను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో విమానం రెక్క భాగం స్వల్పంగా దెబ్బతిన్నట్లు సిబ్బంది గుర్తించారు.

ప్రమాదాన్ని వెంటనే పసిగట్టిన పైలట్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానం సురక్షితంగా నేలకు దిగడంతో ప్రయాణికులతో పాటు, విమాన సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకున్నారు.

అనంతరం ప్రయాణికులందరినీ కిందకు దించివేసి, సాంకేతిక నిపుణులు విమానానికి మరమ్మతులు చేపట్టారు. సుమారు గంట వ్యవధిలోనే రెక్కకు జరిగిన నష్టాన్ని సరిదిద్ది, విమానం ప్రయాణానికి సురక్షితమని నిర్ధారించారు. ఆ తర్వాత అదే విమానంలో ప్రయాణికులను తమ గమ్యస్థానానికి పంపించారు. సరైన సమయంలో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Gannavaram Airport
Vijayawada
Bengaluru
flight accident
bird strike
emergency landing
pilot
aviation safety
Andhra Pradesh
aviation

More Telugu News