Vladimir Putin: అమరత్వం, 150 ఏళ్లు బతకడంపై పుతిన్, జిన్‌పింగ్ మధ్య సంభాషణ

Vladimir Putin Xi Jinping discuss immortality lifespan
  • సైనిక పరేడ్ చూడటానికి వెళుతున్న సమయంలో ఆసక్తికర సంభాషణ
  • బయోటెక్నాలజీ ద్వారా యవ్వనంగా ఉండొచ్చన్న పుతిన్
  • 150 ఏళ్లు బతకడం సాధ్యమేనన్న జిన్‌పింగ్ 
ప్రపంచ రాజకీయాల్లో ఇద్దరు బలమైన నేతలుగా ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య ఓ ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది. మనిషి ఆయుష్షు, అమరత్వం వంటి అంశాలపై వారిద్దరూ మాట్లాడుకోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ సంభాషణ చైనా అధికారిక మీడియాతో పాటు పలు అంతర్జాతీయ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కావడంతో వైరల్‌గా మారింది.

చైనా రాజధాని బీజింగ్‌లోని తియానన్మెన్ స్క్వేర్‌లో నిన్న జరిగిన సైనిక పరేడ్‌ను చూడటానికి వెళుతున్న సమయంలో ఈ ఇద్దరు నేతల మధ్య ఈ మాటామంతీ నడిచింది. ఈ సంభాషణలో పుతిన్ మాట్లాడుతూ, బయోటెక్నాలజీ అభివృద్ధి వల్ల అవయవ మార్పిడులు సర్వసాధారణమవుతాయని, దాని ద్వారా యవ్వనంగా ఉంటూ అమరత్వం సాధించవచ్చని వ్యాఖ్యానించారు. దీనికి జిన్‌పింగ్ స్పందిస్తూ, ఈ శతాబ్దంలో మానవులు 150 ఏళ్ల వరకు జీవించగలరనే అంచనాలు ఉన్నాయని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సమయంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వారిని చూసి నవ్వుతూ కనిపించినప్పటికీ, వారి సంభాషణలో పాలుపంచుకున్నారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు.

రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా ఈ భారీ ఆయుధ ప్రదర్శనను నిర్వహించింది. దాదాపు 50 వేల మంది సందర్శకుల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో హైపర్‌సోనిక్ క్షిపణులు, అత్యాధునిక డ్రోన్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ, ప్రపంచానికి యుద్ధం కావాలో, శాంతి కావాలో తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమానికి ముందు జరిగిన షాంఘై సహకార సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 20 దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా పుతిన్, జిన్‌పింగ్ ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా 20 ఒప్పందాలపై సంతకాలు చేశారు. కృత్రిమ మేధ (AI), గ్యాస్ పైప్‌లైన్ సహా పలు రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
Vladimir Putin
Putin
Xi Jinping
China
Russia
immortality
biotechnology
world war 2
Kim Jong Un
lifespan

More Telugu News