ఇంగ్లండ్‌ కీలక నిర్ణయం.. 16 ఏళ్లలోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలపై నిషేధం!

  • పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రభుత్వ ఆందోళన
  • తల్లిదండ్రులు, టీచర్ల నుంచి వచ్చిన ఒత్తిడితో ప్రభుత్వ చర్యలు
  • కొన్ని డ్రింక్స్‌లో రెండు కప్పుల కాఫీకి మించిన కెఫిన్ ఉన్నట్టు వెల్లడి
  • చట్టం అమలుకు ముందు 12 వారాల పాటు ప్రజాభిప్రాయ సేకరణ
  • డైట్ కోక్, టీ, కాఫీ వంటి వాటికి ఈ నిషేధం నుంచి మినహాయింపు
పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంగ్లండ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 16 ఏళ్లలోపు వయసున్న వారికి రెడ్ బుల్, మాన్‌స్టర్, ప్రైమ్ వంటి అధిక కెఫిన్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానుంది. దుకాణాలు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, వెండింగ్ మెషీన్లు, ఆన్‌లైన్ వేదికలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. 

ఈ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల పిల్లల్లో తీవ్రమైన తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలో ఉండే అధిక మోతాదు కెఫిన్ గుండె వేగంగా కొట్టుకోవడం, అసాధారణ హృదయ స్పందనలు, కొన్నిసార్లు మూర్ఛలకు కూడా దారితీయవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు. కొన్ని ప్రముఖ ఎనర్జీ డ్రింక్స్‌లో రెండు కప్పుల కాఫీలో ఉండే కెఫిన్ కంటే ఎక్కువ మోతాదులో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. యూకేలో దాదాపు మూడో వంతు పిల్లలు ప్రతీ వారం వీటిని సేవిస్తున్నారని అంచనా.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, చివరకు పిల్లల నుంచి కూడా వచ్చిన విజ్ఞప్తుల మేరకే ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య, సామాజిక సంరక్షణ కార్యదర్శి వెస్ స్ట్రీటింగ్ తెలిపారు. "ఈ పానీయాలు పిల్లల ఆరోగ్యం, ఏకాగ్రత, చదువుపై చూపుతున్న ప్రభావాన్ని మేం గమనించాం. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం" అని ఆయన వివరించారు. ఈ చట్టం అమలుకు ముందు, 12 వారాల పాటు ఆరోగ్య, విద్యా నిపుణులు, ప్రజలు, తయారీదారుల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ప్రముఖ చెఫ్ జామీ ఆలివర్ కూడా ఈ డ్రింక్స్ ప్రమాదకరమని, వీటిని ఉదయాన్నే తాగిన పిల్లలు స్కూళ్లలో అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారని గతంలో హెచ్చరించారు. అయితే, డైట్ కోక్ వంటి తక్కువ కెఫిన్ ఉన్న సాఫ్ట్ డ్రింక్స్‌తో పాటు టీ, కాఫీలపై ఈ నిషేధం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.


More Telugu News