: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్లీ జోరు.. ఐదు నెలల్లోనే జీహెచ్ఎంసీకి రికార్డు ఆదాయం

  • జీహెచ్ఎంసీ ఆదాయంలో భారీ పెరుగుదల
  • గత ఏడాదితో పోలిస్తే 90 శాతం వృద్ధి
  • ఐదు నెలల్లోనే రూ.750 కోట్లకు పైగా ఆదాయం
  • గాడిన పడుతున్న హైదరాబాద్ స్థిరాస్తి రంగం
  • అనుమతుల్లో వేగం పెంచిన 'బిల్డ్ నౌ' విధానం
  • 4,389 భవన నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ గాడిన పడుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నగరంలో నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఖజానాకు భారీగా ఆదాయం వస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లోనే భవన నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయం ఏకంగా 90 శాతం పెరగడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేవలం ఐదు నెలల కాలంలోనే జీహెచ్ఎంసీకి భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల (ఓసీ) ద్వారా ఏకంగా రూ.750.98 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.309.81 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు అని జీహెచ్ఎంసీ నిన్న  విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఐదు నెలల వ్యవధిలో అధికారులు మొత్తం 4,389 భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా 1,008 నివాసయోగ్య పత్రాలను జారీ చేశారు.

గత ఆర్థిక సంవత్సరం (2024-25) మొత్తంలో పట్టణ ప్రణాళికా విభాగం ద్వారా బల్దియాకు రూ.1138.44 కోట్ల ఆదాయం రాగా, ఈసారి తొలి ఐదు నెలల్లోనే అందులో 65 శాతానికి పైగా ఆదాయం రావడం గమనార్హం. స్థిరాస్తి రంగంలో క్రయవిక్రయాలు పెరగడంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఉత్సాహం చూపుతున్నాయని ఓ అధికారి తెలిపారు. ఇండిపెండెంట్ ఇళ్లతో పాటు ఐదు అంతస్తులలోపు భవనాల నిర్మాణాలు కూడా పెరిగాయని ఆయన పేర్కొన్నారు.

దీనికి తోడు, ఈ ఏడాది మార్చి 20 నుంచి జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న 'బిల్డ్ నౌ' విధానం అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసింది. అధునాతన టెక్నాలజీతో పాటు సింగిల్ విండో విధానం ద్వారా రెవెన్యూ, ఇరిగేషన్ వంటి ఇతర శాఖల నుంచి నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీ) సులభంగా లభిస్తుండటంతో దరఖాస్తులు వేగంగా పరిష్కారమవుతున్నాయని బల్దియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ కారణాల వల్లే నిర్మాణ రంగం ఊపందుకుని, బల్దియా ఆదాయం గణనీయంగా పెరిగిందని తెలుస్తోంది.

More Telugu News