ఈ-కామర్స్ సంస్థలకు సోనాక్షి సిన్హా సీరియస్ వార్నింగ్

  • తన ఫొటోలు వాడుతున్న ఈ-కామర్స్ సైట్లపై సోనాక్షి సిన్హా ఆగ్రహం
  • అనుమతి లేకుండా వాడటంపై సోషల్ మీడియాలో తీవ్ర హెచ్చరిక
  • వెంటనే తొలగించకపోతే లీగల్ యాక్షన్ తప్పదని స్పష్టీకరణ
తన ఫొటోలను అనుమతి లేకుండా వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకుంటున్న కొన్ని ఈ-కామర్స్ సంస్థలపై బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన చిత్రాలను వెంటనే తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. 

తాను తరచుగా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తుంటానని, ఆ సమయంలో కొన్ని ప్రముఖ వెబ్‌సైట్లలో తన ఫొటోలను చూసి షాక్ అయినట్లు సోనాక్షి తెలిపారు. తన అనుమతి కానీ, కనీసం సమాచారం కానీ లేకుండా తన వ్యక్తిగత ఫొటోలను వాణిజ్య ప్రకటనల కోసం వాడుకోవడం నైతికంగా సరైంది కాదని ఆమె అన్నారు. "ఏదైనా డ్రెస్ లేదా ఆభరణం నచ్చితే, ఆ బ్రాండ్ వివరాలతో సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాను. అంతమాత్రాన నా ఫొటోలను మీ వెబ్‌సైట్‌లో పెట్టుకుని వ్యాపారం చేసుకుంటానంటే అస్సలు ఊరుకోను. వెంటనే నా ఫొటోలు తొలగించండి, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని తన పోస్టులో సోనాక్షి సిన్హా హెచ్చరించారు.

సెలబ్రిటీల ఫొటోలను వారి అనుమతి లేకుండా వ్యాపారానికి వాడుకోవడం సరికాదంటూ సోనాక్షి తీసుకున్న ఈ స్టాండ్‌కు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే, సోనాక్షి సిన్హా ఇటీవల ‘నికితా రాయ్’ అనే సైకలాజికల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను పలకరించారు. ఆమె సోదరుడు ఖుష్ ఎన్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, పరేశ్ రావల్ కీలక పాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ‘హీరామండీ’ వెబ్‌సిరీస్‌తో కూడా సోనాక్షి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 


More Telugu News