Srinidhi Shetty: పున్నమి సరస్సులో పుట్టిన వెన్నెల శిల్పం .. శ్రీనిధి శెట్టి!

Srinidhi Shetty Special
  • మోడల్ గా మెరిసిన శ్రీనిధి శెట్టి 
  • 'కేజీఎఫ్'తో మొదలైన క్రేజ్ 
  • తెలుగు  .. తమిళ భాషల నుంచి అవకాశాలు 
  • వెంకటేశ్ సరసన ఛాన్స్ అంటూ ప్రచారం

 వెండితెరపై విరిసిన కలువల మాదిరిగా చాలామంది అందమైన కథానాయికలు కనిపిస్తూ ఉంటారు. అందానికి ఉదాహరణలే తప్ప నిర్వచనాలు ఉండవు. ఎవరి అందం వారిది .. ఎవరి ప్రత్యేకత వారిది. విశాలమైన నేత్రాలతో మనసులు కొల్లగొట్టేవారు కొందరైతే, సంపెంగ మొగ్గలాంటి నాసికతో చూపులు కట్టిపడేసేవారు మరికొందరు. చక్కని మందహాసంతో మంత్రం వేస్తూ, ఆకర్షణీయమైన చీరకట్టుతో ఆకట్టుకునేది ఇంకొందరు.

అలా మంత్రముగ్ధులను చేసే అందమైన కథానాయికల జాబితాలో శ్రీనిధి శెట్టి కూడా కనిపిస్తుంది. నాజూకుతనానికి నమూనాగా కనిపించే శ్రీనిధి శెట్టి, మోడలింగ్ వైపు నుంచి సినిమాలలోకి వచ్చింది. తొలి సినిమా 'కేజీఎఫ్'తోనే సంచలన విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన హైట్ వైపు నుంచి ఆమె ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఎన్నో ఆఫర్లు ఆమె గుమ్మం ముందుకు తీసుకొచ్చిన సినిమా ఇది. అయినా ఆమె అంగీకరించిన ప్రాజెక్టులు చాలా తక్కువ.  
'కోబ్రా' సినిమాతో కోలీవుడ్ కి పరిచయమైన శ్రీనిధి శెట్టి, ఆ తరువాత ' హిట్ 3' సినిమాతో తెలుగు తెరపైకి వచ్చింది. 'హిట్ 3' సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. అంతే కాదు ఇక్కడ ఆమె అభిమానుల సంఖ్య పెరిగేలా చేయగలిగింది. ఆ తరువాత ఆమె తెలుగులోనే సిద్ధూ జొన్నలగడ్డ జోడీగా,  'తెలుసు కదా' అనే సినిమా చేసింది. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ 17వ తేదీన థియేటర్లకు రానుంది.

ఈ నేపథ్యంలోనే ఆమె వెంకటేశ్ సరసన సందడి చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. వెంకటేశ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక ప్రాజెక్టు పట్టాలెక్కింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలు కానుంది. ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారట. ఒక కథానాయికగా శ్రీనిధి శెట్టిని తీసుకున్నారని వినికిడి. ఈ జోడీ చాలా బాగుంటుందని అంటున్నారు. అదే నిజమైతే, ఇక్కడ శ్రీనిధి జోరు కొనసాగడం ఖాయమేనని అనుకోవాలి. 
Srinidhi Shetty
KGF
Cobra movie
Hit 3 movie
Telusu Kada movie
Venkatesh
Trivikram
Telugu cinema
Neeraja Kona
Siddhu Jonnalagadda

More Telugu News