Kavitha: బీఆర్ఎస్ ను చేజిక్కించుకునే కుట్రలు జరుగుతున్నాయి నాన్న... కేటీఆర్ ను ఓడించేందుకు హరీశ్ డబ్బులు పంపించారు: కవిత

Kavitha Alleges Conspiracy Against BRS by Harish Rao
  • హరీశ్, సంతోశ్ లు బీఆర్ఎస్ ను జలగల్లా పట్టిపీడిస్తున్నారన్న కవిత
  • ప్రాణం పోయినా కేసీఆర్ కు అన్యాయం జరగనివ్వనని వ్యాఖ్య
  • ఆరడుగుల బుల్లెట్ తనను గాయపరిచిందని మండిపాటు
  • ఉపఎన్నికలో ఈటలను హరీశ్ గెలిపించారని ఆరోపణ
  • ఈ విషయాలు కేసీఆర్, కేటీఆర్ గమనించాలని సూచన
బీఆర్ఎస్ లో తనపై కుట్రలు జరిగాయని... రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్ లపై కూడా కుట్రలు జరుగుతాయని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ హరీశ్ రావు, సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని జలగల్లా పట్టిపీడిస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్లలో కేటీఆర్ ను ఓడించేందుకు ప్రత్యర్థులకు హరీశ్ కు రూ. 60 లక్షలు పంపించారని ఆరోపించారు. ఈ విషయం తనకు తెలుసని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలతో హరీశ్, సంతోష్ అంటకాగుతున్నారని దుయ్యబట్టారు. సంతోష్ రావు బాధితులు చాలామంది తనకు ఫోన్లు చేస్తూ వారి బాధలను చెప్పుకుంటున్నారని తెలిపారు.

బీఆర్ఎస్ ఉంటే ఎంత... లేకపోతే ఎంత అని తాను ఎప్పుడూ అనలేదని కవిత చెప్పారు. కేసీఆర్ లేని బీఆర్ఎస్ ఉంటే ఎంత... లేకపోతే ఎంత అని మాత్రమే తాను అన్నానని తెలిపారు. కేసీఆర్ కూతురుగా పుట్టిన తాను... ఆయనను, పార్టీని ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటానని ప్రశ్నించారు. ప్రాణం పోయినా కేసీఆర్ కు అన్యాయం జరగనివ్వనని చెప్పారు. తనకు అధికారం, పదవులు ముఖ్యం కాదని... అధికారంలో ఉన్నా, లేకపోయినా ఒకే మాదిరి ఉంటానని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా తనను ప్రతిపక్ష ఎంపీగానే చూశారని తెలిపారు. 

ఆరడుగుల బుల్లెట్టే (హరీశ్ రావు) తనను గాయపరిచిందని కవిత మండిపడ్డారు. వీళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లి... అక్కడి నుంచి కూడా కుట్రలు చేస్తారని అన్నారు. వీరి వల్లే విజయశాంతి, మైనంపల్లి, ఈటల వంటి నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ఉపఎన్నికలో ఈటలను హరీశ్ దగ్గరుండి గెలిపించారని అన్నారు. ఈ విషయాలన్నింటినీ ఇప్పటికైనా కేటీఆర్ గమనించాలని సూచించారు. "పార్టీలో ఏం జరుగుతోందో చూడండి నాన్న... బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకునే కుట్రలు జరుగుతున్నాయి" అని తన తండ్రి కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు.
Kavitha
BRS party
KCR
KTR
Harish Rao
Santosh Rao
Telangana politics
Sirisilla
Conspiracy
Telangana

More Telugu News