ChatGPT: మీ పిల్లలు చాట్‌జీపీటీ వాడుతున్నారా?.. ఇక మీరే నియంత్రించవచ్చు!

ChatGPT Parental Controls Alert Parents to Teen Stress
  • చాట్‌జీపీటీలో పేరెంటల్ కంట్రోల్స్ ప్రవేశపెట్టనున్న ఓపెన్ఏఐ
  • పిల్లలు తీవ్ర ఒత్తిడిలో ఉంటే తల్లిదండ్రులకు నోటిఫికేషన్
  • టీనేజర్ల ఖాతాలకు తల్లిదండ్రుల అకౌంట్ లింక్ చేసుకునే సౌకర్యం
  • సున్నితమైన సంభాషణల కోసం జీపీటీ-5 వంటి అధునాతన మోడల్ వినియోగం
  • ఈ ఏడాదిలోనే కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనం చాట్‌జీపీటీని వినియోగిస్తున్న టీనేజర్ల భద్రత కోసం దాని మాతృ సంస్థ ఓపెన్ఏఐ కీలక ముందడుగు వేసింది. ఇకపై తమ పిల్లలు చాట్‌జీపీటీని వాడుతున్నప్పుడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్టు గుర్తిస్తే, వారి తల్లిదండ్రులకు సమాచారం అందించేలా కొత్త పేరెంటల్ కంట్రోల్ ఫీచర్లను తీసుకురానున్నట్టు ప్రకటించింది. టెక్నాలజీ ప్రపంచంలో ఈ మార్పు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ కొత్త విధానం కింద, తల్లిదండ్రులు తమ ఖాతాలను తమ పిల్లల (13 ఏళ్లు లేదా ఆపైబడిన) చాట్‌జీపీటీ ఖాతాలకు ఒక ఈమెయిల్ ఇన్వైట్ ద్వారా లింక్ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా పిల్లల వయసుకు తగిన భద్రతా సెట్టింగ్‌లు ఆటోమేటిక్‌గా ఎనేబుల్ అవుతాయి. అంతేకాకుండా, చాట్ హిస్టరీ, మెమొరీ వంటి ఫీచర్లను అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకునే సౌలభ్యాన్ని కూడా కల్పించనుంది. సుదీర్ఘ సెషన్ల మధ్యలో విరామం తీసుకోవాలని సూచిస్తూ ఇన్-యాప్ రిమైండర్‌లను కూడా అందించనుంది.

ఈ అప్‌డేట్‌లో భాగంగా ఓపెన్ఏఐ మరో ముఖ్యమైన సాంకేతికతను పరిచయం చేస్తోంది. వినియోగదారులు తీవ్ర ఆందోళన లేదా సున్నితమైన అంశాలపై చర్చిస్తున్నప్పుడు, సిస్టమ్ దానిని స్వయంగా గుర్తిస్తుంది. అప్పుడు సాధారణ చాట్ మోడల్ నుంచి 'జీపీటీ-5 థింకింగ్' వంటి అధునాతన రీజనింగ్ మోడల్‌కు సంభాషణను ఆటోమేటిక్‌గా మళ్లిస్తుంది. దీనివల్ల వినియోగదారులకు మరింత సరైన, సహాయకరమైన సమాధానాలు లభిస్తాయని కంపెనీ వివరించింది.

ఈ ఫీచర్లను ఈ ఏడాదిలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఓపెన్ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ముందుగా, 120 రోజుల పాటు ఈ ప్రణాళికలను ప్రివ్యూ కోసం ఉంచి, అవసరమైన మార్పులపై అభిప్రాయాలను స్వీకరించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.
ChatGPT
OpenAI
parental controls
teenagers
AI safety
GPT-5 Thinking
child safety
artificial intelligence
online safety
mental health

More Telugu News