: కాళేశ్వరం నివేదికపై స్టేకు హైకోర్టు నో

  • కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేసిన మాజీ అధికారి
  • రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి దాఖలు చేసిన పిటిషన్
  • నివేదికపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు
  • సాక్షిగా పిలిచి నివేదికలో ఆరోపణలు చేశారని ఆవేదన
  • పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ నివేదికను నిలిపివేయాలని కోరుతూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నివేదికపై తక్షణమే స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఎస్కే జోషి, ఘోష్ కమిషన్ నివేదిక తన హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని ఆయన కోరగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా "అసలు కమిషన్ నివేదిక మీకు ఎలా చేరింది?" అని న్యాయస్థానం పిటిషనర్‌ను ప్రశ్నించింది.

వాదనలు విన్న అనంతరం, నివేదికపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్కే జోషిని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

పిటిషన్‌లో జోషి వాదనలు ఇవే..
విచారణ కమిషన్ తనను కేవలం సాక్షిగా మాత్రమే విచారణకు పిలిచిందని, కానీ తుది నివేదికలో తనపై ఆరోపణలు చేసిందని ఎస్కే జోషి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆరోపణలు చేసే ముందు తనకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం కూడా కల్పించకుండా నివేదిక రూపొందించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. జులై 31న కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలను ప్రభుత్వం మీడియా సమావేశంలో వెల్లడించిందని, ఇది తన ప్రతిష్ఠ‌కు భంగం కలిగించేలా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News