'SSMB 29' ఆఫ్రికా షెడ్యూల్ పూర్తి.. రాజమౌళిపై కెన్యా మంత్రి ప్రశంసల వర్షం

  • కెన్యా విదేశాంగ మంత్రిని కలిసిన రాజమౌళి  
  • జక్కన్నపై ప్రశంసల వర్షం కురిపించిన మంత్రి ముసాలియా ముదావడి
  • ఆఫ్రికా సన్నివేశాల్లో 95 శాతం కెన్యాలోనే చిత్రీకరణ
  • ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో సినిమా విడుదల కానున్నట్లు వెల్లడి
  • భారత్‌కు తిరుగుపయనమైన రాజమౌళి చిత్ర బృందం
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'SSMB 29'. ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన అప్‌డేట్‌ను కెన్యా విదేశాంగ శాఖ మంత్రి ముసాలియా ముదావడి స్వయంగా వెల్లడించారు. ఆఫ్రికాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయిందని, చిత్ర బృందం భారత్‌కు తిరుగుపయనమైందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయతో పాటు ఇతర ప్రతినిధులతో తాను సమావేశమైన ఫొటోలను ఆయ‌న‌ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

కెన్యాలో సినిమా షూటింగ్ జరుపుకోవడంపై మంత్రి ముదావడి హర్షం వ్యక్తం చేశారు. "ప్రపంచంలోని గొప్ప ఫిలిం మేకర్లలో ఒకరైన రాజమౌళికి గత రెండు వారాలుగా కెన్యా వేదికగా నిలిచింది. తన అద్భుతమైన కథనాలతో, విజువల్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన దార్శనికుడు ఆయన" అని ముదావడి తన ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతాలో ప్రశంసించారు. ఆసియాలోనే అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థ తమ దేశంలో షూటింగ్ జరుపుకోవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

సినిమాకు సంబంధించిన ఆసక్తికర వివరాలను కూడా మంత్రి పంచుకున్నారు. తూర్పు ఆఫ్రికాలోని పలు దేశాల్లో లొకేషన్ల కోసం వెతికిన తర్వాత, రాజమౌళి బృందం కెన్యాను ప్రధాన షూటింగ్ ప్రదేశంగా ఎంచుకుందని ఆయన తెలిపారు. సినిమాలోని ఆఫ్రికా సన్నివేశాల్లో దాదాపు 95 శాతం చిత్రీకరణ తమ దేశంలోనే జరిగిందని స్పష్టం చేశారు. మసాయ్ మారా, నైవాషా, సంబురు, అంబోసెలీ వంటి సుందరమైన ప్రదేశాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు వివరించారు.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో విడుదల కానుందని మంత్రి ముదావడి వెల్ల‌డించారు. ఇది సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని, తమ దేశ సౌందర్యాన్ని, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప అవకాశమని ఆయన అన్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం భారత్‌కు బయలుదేరినట్లు తెలుపుతూ, ఈ సినిమా ద్వారా కెన్యా కథ ప్రపంచానికి తెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మహేశ్‌ బాబు సరసన ప్రియాంక చోప్రా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. 


More Telugu News