Janhvi Kapoor: శ్రీదేవి మరణంపై జాన్వీ కపూర్ భావోద్వేగ వ్యాఖ్యలు

Janhvi Kapoor on Sridevis Death and Family Struggles
  • తల్లి శ్రీదేవి మరణానంతరం అనేక అవమానాలు ఎదుర్కొన్నానన్న నటి జాన్వీ కపూర్
  • తన కుటుంబ సభ్యులను మనుషుల్లాగా చూడలేదని ఆవేదన వ్యక్తం చేసిన జాన్వీ
  • తన తల్లి మరణం చాలా మందికి ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారిపోయిందన్న జాన్వీ
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన తల్లి, దిగ్గజ నటి శ్రీదేవి మృతిని గుర్తు చేసుకుంటూ, ఆ తర్వాత తమ కుటుంబం ఎదుర్కొన్న అవమానాలను ప్రస్తావించారు. ఒక తాజా ఇంటర్వ్యూలో జాన్వీ చేసిన భావోద్వేగపూరిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

“ఒకానొక సమయంలో మా కుటుంబ సభ్యులను మనుషుల్లా కూడా చూడలేదు. మమ్మల్ని ఏదోలా చూశారు. కొందరు మా మీద బురద జల్లాలని ప్రయత్నించారు. ఎవరూ సానుభూతి చూపలేదు” అంటూ జాన్వీ ఆవేదన వ్యక్తం చేశారు.

“అమ్మ మరణం.. కొంతమందికి ఎంటర్‌టైన్‌మెంట్ అయింది”

2018లో శ్రీదేవి అకాల మరణం చెందగా, అదే సమయంలో జాన్వీ తన తొలి సినిమా 'ధడక్'కి సిద్ధమవుతున్నారు. ఆమె తల్లి మృతి చెందిన బాధలో ఉండగానే ప్రమోషన్స్, మీడియా ఎదుట కనిపించాల్సి రావడం ఆమెపై తీవ్ర మనోభారాన్ని కలిగించింది.

“అమ్మ మరణం నాకు వ్యక్తిగతంగా ఎంతటి కోపం, బాధ కలిగించిందో... కొంత మందికి అది ఒక గాసిప్ అయింది. ఓ ఎంటర్‌టైన్‌మెంట్ అయింది. నేను నవ్వితే తప్పు, సైలెంట్‌గా ఉంటే మౌనంగా ఉందని వ్యాఖ్యానించేవారు,” అంటూ ఆమె మీడియా ధోరణిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

సినీ ప్రయాణం – ఇప్పుడు జోరుగా

శ్రీదేవి మృతి తర్వాత కూడా వెనక్కు తగ్గకుండా, కష్టపడుతూ తన సినీ ప్రయాణాన్ని జాన్వీ కొనసాగిస్తున్నారు. ఇటీవల 'పరమ్ సుందరి' చిత్రంతో జాన్వీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వచ్చే అక్టోబర్ 2న విడుదల కానున్న 'సన్నీ సంస్కారి కీ తులసీ కుమారి' సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో జాన్వీ బిజీగా ఉన్నారు.

మరోవైపు, తెలుగులో రామ్ చరణ్ సరసన 'పెద్ది' సినిమాలో జాన్వీ నటిస్తున్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. 
Janhvi Kapoor
Sridevi death
Bollywood actress
Dhadak movie
Entertainment industry
Media criticism
Sunny Sanskari Ki Tulsi Kumari
Ram Charan Peddi movie
Buchi Babu Sana

More Telugu News