Shambhavi Choudhary: ఎవరీ శాంభవి చౌదరి..?

Shambhavi Choudhary Who is She Rising in Bihar Politics
  • బిహార్‌ రాజకీయాల్లో కొత్త వెలుగు అంటిస్తున్న యువ నాయకురాలు ఎంపీ శాంభవీ చౌధరి
  • రాజకీయాలు అనేవి ఓ బాధ్యత, అన్ని వేళలా బాధ్యతగా ఉండాల్సిందేనన్న శాంభవీ చౌధరి
  • తొలిసారి జేడీయూతో కలిసి పోటీ చేయనున్నామన్న శాంభవీ చౌధరి 
  • పార్టీలను పక్కన పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూటమి బలోపేతానికి కృషి చేస్తున్నారన్న శాంభవి చౌధరి
బిహార్ రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వేడెక్కుతున్న వేళ, లోక్‌ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నుంచి ఒక యువ నాయకురాలి పేరు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆమె ఎవరో కాదు... శాంభవీ చౌధరి. సమస్తిపుర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె, రాజకీయాలను సేవా మాధ్యమంగా భావిస్తూ ప్రజల్లోకి తనదైన శైలిలో దూసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కావడంతో తాను తాత, నాన్నలపై ప్రజలు చూపిన ప్రేమ, అభిమానాలను కళ్లారా చూశానని శాంభవి తెలిపారు. ఇప్పుడు తనపై అదే విధమైన ఆదరణ ప్రజలు చూపుతున్నారని, వారి ఆశీర్వాదాల వల్లే పార్లమెంటులో అడుగు పెట్టగలిగానని చెప్పుకొచ్చారు. రాజకీయాలు ఒక బాధ్యత అని, అన్ని వేళలా బాధ్యతగా ఉండాల్సిందేనని ఆమె అన్నారు.

ఇతర వృత్తులతో రాజకీయాలను పోల్చడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతి ఉద్యోగంలో ఇబ్బందులు, సౌలభ్యాలు ఉంటాయని, కానీ రాజకీయాలు మాత్రం వేరని అన్నారు. రాజకీయాలు ప్రజాభిప్రాయంపైనే ఆధారపడి ఉంటాయన్నారు. కేవలం కష్టపడితే సరిపోదని, ప్రజల ఆదరణ పొందాలని సూచించారు. కుటుంబ వారసత్వం ఉన్నప్పటికీ రాజకీయాల్లోకి రావాలని చిన్నప్పటి నుంచి లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతోనే విజయం సాధించానని, ఈ ఘనత మొత్తం తమ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్‌దేనని ఆమె వినమ్రంగా పేర్కొన్నారు.

ఎన్నికల విజయంపై ధీమా

ఎన్డీయే భాగస్వామిగా బిహార్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని శాంభవి అన్నారు. పార్టీలను పక్కన పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూటమి బలోపేతానికి కృషి చేస్తున్నారని తెలిపారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపు తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. తొలిసారి జేడీయూతో కలిసి పోటీ చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 225 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

సామాజిక వర్గాల సాధికారతే లక్ష్యం

ముఖ్యంగా దళితులు, మహిళలు, యువతపై దృష్టి సారిస్తున్నామని ఆమె వెల్లడించారు. “ఈ మూడు వర్గాలు – దళితులు, మహిళలు, యువత – బలపడితేనే సమాజం ముందుకు వెళ్లగలదు. వారికి సాధికారత కల్పించాలనే బాధ్యత నా భుజాలపై ఉంది” అంటూ తన మిషన్‌ను శాంభవి చౌధరి స్పష్టం చేశారు. 
Shambhavi Choudhary
Bihar politics
Lok Janshakti Party
Chirag Paswan
Samastipur MP
Bihar assembly elections
NDA alliance
Dalits
women empowerment
youth empowerment

More Telugu News