KCR: కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు: సత్యవతి రాథోడ్

KCR Takes Strict Action Suspending Kavitha Says Satvathi Rathore
  • బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్
  • కేసీఆర్ కు కన్నపేగు కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్న సత్యవతి రాథోడ్
  • ముందుగా హెచ్చరించినా కవిత తీరు మారలేదని వ్యాఖ్య
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో, తన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఇటీవలి కాలంలో కవిత వ్యవహారశైలి, పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నందున అధిష్ఠానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిందని బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలను ఉపేక్షించేది లేదని ఈ సస్పెన్షన్ ద్వారా అధినేత కేసీఆర్ స్పష్టమైన సందేశం పంపారు.

ఈ నిర్ణయంపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఇతర మహిళా నేతలతో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. పేగుబంధం కంటే పార్టీని నమ్ముకున్న లక్షలాది మంది కార్యకర్తలకే కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారని ఆమె అన్నారు. "కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదని కేసీఆర్ మరోసారి నిరూపించారు" అని సత్యవతి పేర్కొన్నారు.

కవిత తన తీరు మార్చుకోవాలని అధిష్ఠానం ముందుగానే హెచ్చరించినా ఆమె పట్టించుకోలేదని సత్యవతి తెలిపారు. "పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు కుడిభుజంగా ఉన్న హరీశ్‌రావుపై కవిత విమర్శలు చేయడం కార్యకర్తలను తీవ్రంగా బాధించింది. గతంలో కేటీఆర్‌ను, ఇప్పుడు హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకున్నారు" అని ఆమె గుర్తుచేశారు. కవిత వెనుక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారనే అనుమానం తమకు ఉందని ఆమె అన్నారు. కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చినా, పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అనే రీతిలో మాట్లాడటం సరికాదని సత్యవతి హితవు పలికారు. 
KCR
Kalvakuntla Kavitha
BRS Party
Telangana Politics
Satvathi Rathore
Harish Rao
KTR
Party Suspension
Political News

More Telugu News