Mukesh Aghi: అమెరికా 'బ్రాహ్మణ' వ్యాఖ్యలపై యూఎస్ఐఎస్‌పీఎఫ్ అధ్యక్షుడి స్పందన

Mukesh Aghi comments on US India relations and tariffs
  • యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ సీఈవో ముఖేశ్ అఘీ వ్యాఖ్యలు
  • నవారో 'బ్రాహ్మణ' వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్న యూఎస్ఐఎస్‌పీఎఫ్ అధ్యక్షుడు
  • అమెరికా అధికారుల వ్యాఖ్యలు అజ్ఞానంతో చేసినవన్న ముఖేష్ అఘి
  • భారత్‌పై అమెరికా సెకండరీ టారిఫ్‌లు విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన యూఎస్-ఇండియా ఫోరమ్
  • 25 ఏళ్ల శ్రమతో నిర్మించుకున్న బంధం 25 గంటల్లో నాశనమవుతోందని ఆవేదన
  • అధిక టారిఫ్‌తో ఇరు దేశాలకూ తీవ్ర నష్టమని హెచ్చరిక
భారత్-అమెరికా సంబంధాలపై వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను భారత్ అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ (యూఎస్ఐఎస్‌పీఎఫ్) అధ్యక్షుడు, సీఈవో ముఖేష్ అఘీ సూచించారు. కొన్ని వ్యాఖ్యలు భారత్‌పై సరైన అవగాహన లేని అజ్ఞానం నుంచి వస్తాయని, వాటిని విస్మరించి ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు.

రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు ముడిచమురు కొనుగోలు చేయడాన్ని విమర్శిస్తూ పీటర్ నవారో కులపరమైన వ్యాఖ్యలు చేశారు. "భారత ప్రజల సొమ్ముతో బ్రాహ్మణులు లాభాలు గడిస్తున్నారు" అంటూ ఆయన ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై ముఖేష్ అఘి మంగళవారం ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ స్పందించారు. "వైట్ హౌస్ నుంచి, ముఖ్యంగా పీటర్ నవారో నుంచి వస్తున్న కొన్ని మాటలు భారత్ గురించి తెలియని అజ్ఞానంతో కూడుకున్నవి. ఇలాంటి వాటిని పట్టించుకోకుండా రెండు దేశాల మధ్య సంబంధాల జోరును కొనసాగించాలి" అని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పూర్తిగా ఏకపక్షంగా ఉన్నాయని, భారత్ అధిక సుంకాలు విధిస్తోందని ఆరోపించారు. సుంకాలను సున్నాకు తగ్గించడానికి భారత్ ఇప్పుడు ముందుకొచ్చిందని, కానీ ఇప్పటికే ఆలస్యమైందని ఆయన వ్యాఖ్యానించారు.

ట్రంప్ వ్యాఖ్యలపై అఘీ స్పందిస్తూ, ఆయన చేసే అన్ని వ్యాఖ్యలను లేదా ట్వీట్లను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

"అధ్యక్షుడు చేసే కొన్ని వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి, కొన్నింటికి ఇవ్వక్కర్లేదు. ఆయన చేసే ట్వీట్లలో కొన్నింటిలో విషయం ఉండవచ్చు, కొన్నింటిలో ఉండకపోవచ్చు. భారత ప్రజలు పరిణతి చెందినవారు. దేశ ప్రయోజనాల కోసం ఏం చేయాలో వారికి బాగా తెలుసు" అని ముఖేష్ అఘీ వివరించారు.

అమెరికా అధిక సుంకాలతో భారత్, అమెరికా దేశాలకు నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌పై అమెరికా 'సెకండరీ టారిఫ్‌లు' విధించడాన్ని ముఖేశ్ అఘీ తప్పుపట్టారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం అనవసరమని, దీనివల్ల రెండు దేశాల మధ్య గత 25 ఏళ్లుగా నిర్మించుకున్న బలమైన సంబంధాలు కేవలం 25 గంటల్లోనే నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్-చైనా సంబంధాలు దీర్ఘకాలంలో అమెరికా-భారత్ స్థాయిని అందుకుంటాయని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అన్ని కోణాల నుంచి సముచితమైనదే అన్నారు.
Mukesh Aghi
USISPF
India US relations
Peter Navarro
India Russia oil
Donald Trump tariffs
India trade policy

More Telugu News