బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావుకు వంద కోట్ల జరిమానా

  • గోల్డ్ స్మగ్లింగ్ కేసులో చిక్కుకున్న కన్నడ నటి రన్యారావు
  • రూ.102 కోట్లకు పైగా జరిమానా విధిస్తూ డీఆర్ఐ నోటీసులు
  • జైల్లోనే నటికి నోటీసులు అందజేసిన అధికారులు
  • నలుగురు నిందితులపై మొత్తం రూ.270 కోట్ల పెనాల్టీ
  • జరిమానా చెల్లించకపోతే ఆస్తుల జప్తు అని హెచ్చరిక
  • సెప్టెంబర్ 11కు కర్ణాటక హైకోర్టులో తదుపరి విచారణ
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయి జైల్లో ఉన్న కన్నడ నటి రన్యారావుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) భారీ షాక్ ఇచ్చింది. ఆమెకు ఏకంగా రూ.102.55 కోట్ల జరిమానా విధిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న రన్యారావుకు అధికారులు ఈ నోటీసులను జైల్లోనే అందజేశారు.

ఈ కేసులో రన్యారావుతో పాటు మరో ముగ్గురు నిందితులుగా ఉన్నారు. నలుగురిపైనా కలిపి మొత్తం రూ.270 కోట్ల పెనాల్టీ విధించినట్లు అధికారులు తెలిపారు. నిర్దేశిత గడువులోగా జరిమానా చెల్లించని పక్షంలో ఆమె ఆస్తులను జప్తు చేస్తామని కూడా నోటీసులో స్పష్టంగా హెచ్చరించారు. దీంతో ఈ కేసు మరోసారి కన్నడ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ ఏడాది మార్చి మొదటి వారంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 14.3 కిలోల బంగారంతో రన్యారావు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు. అప్పుడే ఆమెను అరెస్ట్ చేసి, విచారణ చేపట్టారు. ఈ కేసులో విచారణ అనంతరం నిందితులకు ఏడాది జైలు శిక్ష పడింది.

ఇదిలా ఉండగా, విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది.


More Telugu News