Mahesh Kumar Goud: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్... టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఏమన్నారంటే?

Mahesh Kumar Goud on Kavithas Suspension from BRS
  • కవితను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదన్న మహేశ్ కుమార్ గౌడ్
  • ఆమె సస్పెన్షన్ బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమని వ్యాఖ్య
  • అవినీతి సొమ్ము పంపకాలలో తేడాతోనే కవిత వ్యాఖ్యలు చేశారన్న టీపీసీసీ చీఫ్
  • పదేళ్ల బీఆర్ఎస్ పాలన అవినీతిని ఆమె బయటపెట్టాలని డిమాండ్
ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని, ఆమె అవసరం తమ పార్టీకి ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, దానితో తమకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కవిత చేసిన తాజా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలు రావడం వల్లే ఇప్పుడు కవిత ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి బాగోతాన్ని కవిత పూర్తిగా బహిర్గతం చేయాలని మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు.

తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కఠిన చర్యలు తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో ఆమెను పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలోని కీలక నేతలు హరీశ్ రావు, సంతోష్ రావులపై కవిత బహిరంగంగా విరుచుకుపడిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.

అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే, హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, మాజీ రాజ్యసభ సభ్యుడు మేఘా కృష్ణారెడ్డిపై కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రతిష్ఠకు వీరే మచ్చ తెచ్చారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పెద్ద కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని, వారి వల్లే ఇప్పుడు కేసీఆర్ సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "ఐదేళ్లు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావుకు ఈ విషయంలో ప్రధాన పాత్ర లేదా?" అని కవిత సూటిగా ప్రశ్నించారు. కవిత వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంది.
Mahesh Kumar Goud
Kavitha
BRS
TPCC
Telangana Congress
Harish Rao
KCR
BRS Suspension

More Telugu News