Peter Navarro: మోదీపై ట్రంప్ సలహాదారు తీవ్ర వ్యాఖ్యలు.. పుతిన్‌తో కలవడం సిగ్గుచేటంటూ ఫైర్

Trump Advisor Navarro Attacks Modi over Putin Ties
  • పుతిన్, జిన్‌పింగ్‌లతో ప్రధాని మోదీ భేటీపై ట్రంప్ సలహాదారు ఫైర్
  • రష్యా నుంచి చమురు కొంటూ యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోందని ఆరోపణ
  • భారత్‌ను 'టారిఫ్‌ల మహారాజా'అని అభివర్ణన
  • అమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన భారత ప్రభుత్వం
 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో భేటీ కావడాన్ని ఆయన 'సిగ్గుచేటు'గా అభివర్ణించారు.  

"ప్రధాని మోదీ.. పుతిన్, జిన్‌పింగ్‌లతో జతకట్టడం సిగ్గుచేటు. ఆయన ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. రష్యాతో కాకుండా మాతో కలిసి ఉండాల్సిన అవసరం ఉందని ఆయన త్వరలోనే గ్రహిస్తారని ఆశిస్తున్నాం" అని నవారో అన్నారు. భారత్‌పై ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌ల బాంబు పేల్చిన నాటి నుంచి పీటర్ నవారో తరచూ భారత్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

రష్యా నుంచి భారత్ ముడి చమురును కొనుగోలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ చమురు కొనుగోళ్ల ద్వారా వచ్చే ఆదాయంతోనే పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నారని ఆరోపించారు. గంటల్లోనే యుద్ధాన్ని ఆపగలనని ట్రంప్ గతంలో ప్రకటించినప్పటికీ, ఆ ఘర్షణను ముగించడంలో విఫలమయ్యారన్న వాస్తవాన్ని పక్కనపెట్టి నవారో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

నవారో తన విమర్శలను ఇక్కడితో ఆపలేదు. గతంలో భారత్‌ను 'టారిఫ్‌ల మహారాజా' అని అభివర్ణించిన ఆయన ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు ఉన్న దేశాల్లో భారత్ ఒకటని అన్నారు. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొని, శుద్ధి చేసి అధిక ధరకు విక్రయిస్తూ భారత్ 'రష్యాకు లాండ్రోమాట్‌గా' మారిందని ఆరోపించారు. అంతేకాకుండా, రాయితీపై వస్తున్న రష్యా చమురుతో ‘బ్రాహ్మణులు లాభపడుతున్నారని’ కులాల ప్రస్తావన తెచ్చి వివాదాన్ని మరింత తీవ్రతరం చేశారు.

అయితే, అమెరికా చేస్తున్న ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దేశీయంగా ఇంధన ధరలను అదుపులో ఉంచడం, మార్కెట్‌ను స్థిరీకరించడం కోసమే రష్యా నుంచి చమురు కొనాల్సి వస్తోందని భారత్ స్పష్టం చేసింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత జీ7 దేశాలు రష్యా చమురుపై బ్యారెల్‌కు 60 డాలర్ల ధరల పరిమితి విధించాయి. ఈ నిబంధనల ప్రకారమే భారత్ తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తోందని అమెరికా అధికారులు కూడా గతంలో అంగీకరించిన విషయం తెలిసిందే.
Peter Navarro
Donald Trump
Narendra Modi
Vladimir Putin
India Russia relations
Russia Ukraine war
India oil imports
tariff king
SCO summit
US India trade

More Telugu News