Heroines: ముగ్గురు హీరోయిన్స్ ఆనవాయితీ ముగిసినట్టేనా?

Top Three Heroines Special
  • తెరపై టాప్ త్రీ హీరోయిన్స్ సెంటిమెంట్ 
  • వరుస హిట్స్ అందుకున్న నాయికలు  
  • ఎక్కువ కాలం పాటు రాణించిన తీరు 
  • చెదిరిపోతున్న ఆనవాయితీ  

ఒకప్పుడు అందమైన హీరోయిన్స్ తో కళకళలాడిపోయిన తెలుగు తెర, ఇప్పుడు ఆ వైభవంతో  కనిపించడం లేదు. సావిత్రి .. జమున .. కృష్ణకుమారి అప్పట్లో చక్రం తిప్పేశారు. ఆ తరువాత వాణిశ్రీ .. శారద .. కాంచన నాయికల పాత్రలను పరిగెత్తించారు. ఇక శ్రీదేవి .. జయసుధ .. జయప్రద వరుస సినిమాలతో తమ దూకుడు చూపించారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు వంటి హీరోలతో కలిసి ఈ ముగ్గురు కథానాయికలు భారీ విజయాలను అందుకున్నారు. 

ఆ తరువాత కాలంలో తెలుగు తెరకి పరిచయమైన విజయశాంతి .. రాధ .. భానుప్రియ కూడా తమ జోరును కొనసాగించారు. ఈ ముగ్గురు నాయికలు నటనలోనే కాదు, డాన్స్ ల పరంగా కూడా ప్రేక్షకులను మెప్పించడం విశేషం. వీరికి మాదిరిగానే ఎక్కువ కాలం పాటు ఫీల్డ్ లో నిలిచిన హీరోయిన్స్ జాబితాలో, శ్రియ .. కాజల్ .. తమన్నా కనిపిస్తారు. గ్లామర్ పరంగా ఈ ముగ్గురు భామలు మంచి మార్కులు కొట్టేశారు. వీరి తరువాత రంగంలోకి దిగినవారే, పూజ హెగ్డే .. రష్మిక .. కీర్తి సురేశ్. 

కొంతకాలం పాటు ఈ ముగ్గురు బ్యూటీలు టాప్ త్రీ ప్లేస్ లోనే కనిపించారు. అయితే ఆ సర్కిల్ చెదిరిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ, మంచి క్రేజ్ ఉన్న ముగ్గురు హీరోయిన్స్ పేర్లు చెప్పమంటే చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ఆ వరస ఇక్కడ కనిపించడం లేదు. గ్లామర్ పరంగా శ్రీలీల .. భాగ్యశ్రీ బోర్సే తళుక్కున మెరుస్తున్నారుగానీ, వరుస హిట్స్ తో నిలదొక్కుకున్న హీరోయిన్స్ మాత్రం కనిపించడం లేదు. చూస్తుంటే చాలా కాలంగా కొనసాగుతూ వచ్చిన ముగ్గురు హీరోయిన్స్ ఆనవాయితీ ముగిసినట్టే అనిపిస్తోంది కదూ!
Heroines
Telugu cinema
Tollywood
Savitri
Sridevi
Pooja Hegde
Rashmika Mandanna
Keerthy Suresh
Sreeleela
Bhagyashri Borse

More Telugu News