Singireddy Niranjan Reddy: మాజీ మంత్రి పిలుపుతో చనిపోయాడనుకున్న వ్యక్తిలో కదలిక!

Singireddy Niranjan Reddy saves fan from funeral
  • వనపర్తిలో చనిపోయాడనుకున్న వ్యక్తి
  • అంత్యక్రియలకు సిద్ధమవుతున్న కుటుంబసభ్యులు
  • నివాళులర్పించేందుకు వచ్చిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
  • ఆయన పూలమాల వేస్తుండగా శరీరంలో కదలిక
  • పేరు పెట్టి పిలవడంతో స్పందన.. ఆసుపత్రిలో చికిత్సతో కోలుకున్న వైనం
ఒకవైపు అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంధువులంతా విషాదంలో మునిగిపోయారు. ఇంతలో తన వీరాభిమానిని కడసారి చూసేందుకు వచ్చిన మాజీ మంత్రి, ఆయన దేహంపై పూలమాల వేయబోతుండగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. 'చనిపోయాడు' అనుకున్న వ్యక్తి శరీరంలో కదలికలు రావడం, ఆపై ఆసుపత్రిలో చికిత్సతో ప్రాణాలు దక్కించుకోవడం వనపర్తి జిల్లాలో సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే, వనపర్తికి చెందిన తైలం రమేశ్ అనే వ్యక్తి ఆదివారం అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయాడు. కుటుంబసభ్యులు ఎంత పిలిచినా పలకకపోవడం, శరీరంలో ఎలాంటి కదలికా లేకపోవడంతో అతను మరణించాడని నిర్ధారించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రమేశ్ కు నివాళులర్పించేందుకు అతని ఇంటికి వెళ్లారు. రమేశ్ దేహంపై పూలమాల వేయబోతుండగా, ఆయన శరీరంలో స్వల్పంగా కదలికలను గమనించారు. వెంటనే అప్రమత్తమైన నిరంజన్ రెడ్డి, "రమేశ్.. రమేశ్" అని గట్టిగా పిలవడంతో స్పందన మరింత స్పష్టంగా కనిపించింది.

నిరంజన్ రెడ్డి సూచనతో కుటుంబసభ్యులు వెంటనే రమేశ్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించడంతో అతను పూర్తిగా కోలుకుని కళ్లు తెరిచాడు. సరైన సమయంలో దేవుడిలా వచ్చి తమ బిడ్డ ప్రాణాలను నిరంజన్ రెడ్డి కాపాడారని రమేశ్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అనూహ్య ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. 

తైలం రమేశ్ తెలంగాణ ఉద్యమకారుడు. ఉద్యమ సమయం నుంచి నిరంజన్ రెడ్డితో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనపై ఉన్న అభిమానంతో తన ఛాతీపై నిరంజన్ రెడ్డి చిత్రం, పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న రమేశ్, మూడు రోజుల క్రితమే వనపర్తిలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు.


Singireddy Niranjan Reddy
Tailam Ramesh
Wanaparthy
Telangana activist
false death
miraculous recovery
Telangana movement
political loyalty
heart tattoo

More Telugu News