జ‌న సైన్యానికి ధైర్యం ప‌వ‌న్‌: సీఎం చంద్ర‌బాబు

  • నేడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు
  • సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్లువెత్తుతున్న విషెస్‌
  • జ‌న‌సేనానికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన ఏపీ సీఎం, మంత్రి లోకేశ్‌
నేడు ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌న్మ‌దిన‌ శుభాకాంక్ష‌లు తెలియజేస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్ జ‌న‌సేనానికి ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రెన్నో విజ‌య శిఖ‌రాల‌ను అందుకోవాల‌ని చంద్ర‌బాబు, వెండితెర‌పై అభిమానుల‌ను ప‌వ‌ర్‌స్టార్‌గా అల‌రించారంటూ లోకేశ్ పోస్ట్ చేశారు. 

"అడుగ‌డుగునా సామాన్యుడి ప‌క్షం.. అణువ‌ణువునా సామాజిక స్పృహ‌.. మాట‌ల్లో ప‌దును.. చేత‌ల్లో చేవ‌.. జ‌న సైన్యానికి ధైర్యం.. మాట‌కి క‌ట్టుబ‌డే త‌త్వం.. రాజ‌కీయాల్లో విలువ‌ల‌కు ప‌ట్టం.. స్పందించే హృద‌యం.. అన్ని క‌లిస్తే ప‌వ‌నిజం అని న‌మ్మే అభిమానులు, ప్ర‌జ‌ల దీవెన‌ల‌తో నిండు నూరేళ్లూ వ‌ర్ధిల్లాలి. మ‌రెన్నో విజ‌య శిఖ‌రాల‌ను అందుకోవాలి. పాల‌న‌లో రాష్ట్రాభివృద్ధిలో మీ స‌హ‌కారం మ‌రువ‌లేనిది. మీకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు" అని చంద్రుబాబు ట్వీట్ చేశారు. 

వెండితెర‌పై అభిమానుల‌ను ప‌వ‌ర్‌స్టార్‌గా అల‌రించార‌ని మంత్రి లోకేశ్ అన్నారు. జ‌న‌హిత‌మే అభిమతంగా రాజ‌కీయాల్లో ప్ర‌వేశించిన ఆయ‌న పీపుల్ స్టార్‌గా ఎదిగార‌ని ప్ర‌శంసించారు. ప్ర‌జ‌ల కోసం త‌గ్గుతారు.. ప్ర‌జాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతార‌ని కొనియాడారు. ఇక‌, త‌న‌ను సొంత సోద‌రుడి కంటే ఎక్కువ‌గా అభిమానిస్తార‌ని, అండ‌గా నిలుస్తున్న ప‌వ‌న్ అన్న‌కు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు అంటూ లోకేశ్ పోస్ట్ చేశారు.  


More Telugu News