Kriti Sanon: బాలీవుడ్ లో హీరోలకు మంచి కార్లు, రూములు ఇస్తారు: కృతి సనన్

Kriti Sanon on Gender Inequality in Bollywood
  • UNFPA ఇండియా గుడ్‌విల్ అంబాసిడర్‌గా నటి కృతి సనన్ నియామకం
  • బాలీవుడ్‌లో నెలకొన్న లింగ వివక్షపై స్పందించిన నటి
  • హీరోలకు మెరుగైన సదుపాయాలు కేటాయిస్తారంటూ వ్యాఖ్య
  • తనను మహిళగా చూసి తక్కువ చేయొద్దని స్పష్టం చేసిన కృతి
  • ఆలోచనా విధానంలో మార్పు రావాలంటూ పిలుపు
ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ చిత్ర పరిశ్రమలో నెలకొన్న లింగ వివక్షపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోలతో పోలిస్తే హీరోయిన్లను కొన్నిసార్లు తక్కువగా చూస్తారని, చిన్న చిన్న విషయాల్లోనూ ఈ అసమానత స్పష్టంగా కనిపిస్తుందని ఆమె అన్నారు. ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ (UNFPA) ఇండియాకు లింగ సమానత్వ గౌరవ రాయబారిగా నియమితులైన సందర్భంగా ఆమె ఈ విషయాలను పంచుకున్నారు.

కొన్నిసార్లు షూటింగ్‌లో హీరోలకు తనకంటే మెరుగైన కారు లేదా పెద్ద గదిని కేటాయించడం వంటివి జరుగుతాయని కృతి తెలిపారు. "ఇక్కడ సమస్య కారు గురించి కాదు. కానీ నేను మహిళను అయినంత మాత్రాన నన్ను తక్కువగా చూడకండి, పురుషులతో సమానంగా గౌరవించండి అని నేను కోరుకుంటున్నాను" అని ఆమె ఉద్ఘాటించారు. కొన్ని సందర్భాల్లో అసిస్టెంట్ డైరెక్టర్లు తనను ముందే సెట్‌కు పిలిచి, హీరో కోసం ఎదురుచూసేలా చేస్తారని, అలా చేయవద్దని తాను వారితో చెప్పాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. అసలు ఈ ఆలోచనా విధానంలోనే మార్పు రావాలని ఆమె అభిప్రాయపడ్డారు.

తన తల్లి పెరిగిన కాలంలో ఆడపిల్లలపై ఎన్నో ఆంక్షలు ఉండేవని కృతి వివరించారు. "అమ్మకు ఈత, నృత్యం నేర్చుకోవాలని ఉన్నా ఆ రోజుల్లో కుదరలేదు. కానీ ఆమె చదువు కోసం పోరాడి ప్రొఫెసర్ అయ్యారు. ఆ పోరాట స్ఫూర్తితోనే నన్ను, మా చెల్లిని మా కలలను సాకారం చేసుకోమని ప్రోత్సహించారు" అని తెలిపారు.

UNFPA అంబాసిడర్‌గా తన కొత్త పాత్రలో లింగ సమానత్వం కోసం కృషి చేస్తానని కృతి పేర్కొన్నారు. ఇంట్లో మొదలుకొని పనిచేసే చోటు వరకు ప్రతిచోటా సమానత్వాన్ని పాటించడం ద్వారానే నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఆమె అన్నారు.
Kriti Sanon
Bollywood
gender inequality
UNFPA
gender equality
Bollywood actors
Indian actress
movie industry
women empowerment
film shooting

More Telugu News