అలాంటి అవకాశం లేకుండా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు: ఆది శ్రీనివాస్

  • కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగించడంపై స్పందించిన ఆది శ్రీనివాస్
  • కక్ష సాధింపు చర్యలు అనే అవకాశం లేకుండా సీఎం నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్య
  • అన్ని పార్టీల సూచన మేరకు సీబీఐకి ఇస్తున్నట్లు చెప్పామన్న ఆది శ్రీనివాస్
కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా కక్ష సాధింపునకు ఆస్కారం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కక్ష సాధింపు చర్యలని అనడానికి వీల్లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అవినీతి అక్రమాలపై పీసీ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

అసెంబ్లీలో చర్చ అనంతరం ఇచ్చిన మాట ప్రకారం సుదీర్ఘంగా చర్చ జరిగి, అన్ని పార్టీల సూచనల మేరకు కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు చెప్పామని ఆయన అన్నారు. సిట్, ఏసీబీ, సీఐడీలకు అప్పగిస్తే కక్ష సాధింపు చర్యలనే అవకాశం ఉండేదని, సీబీఐకి అప్పగించడం ద్వారా ఆ అవకాశం లేకుండా పోయిందని అన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.

గతంలో కాళేశ్వరం అవినీతికి సంబంధించి సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేతలు పలుమార్లు డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కామధేనువుగా మార్చుకున్నారని పీసీ ఘోష్ కమిషన్‌ ద్వారా తేలిపోయిందని ఆది శ్రీనివాస్ అన్నారు. కేటీఆర్, హరీశ్ రావుల ప్రవర్తన చూస్తుంటే తప్పు చేశామన్న భావన వారిలో కనిపించడం లేదని విమర్శించారు. సీబీఐ కంటే మేలైన సంస్థ ఏదైనా ఉందా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. తెలంగాణ సంపదను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబానికి తగిన శిక్ష పడే అవకాశం ఉందని ఆయన అన్నారు.


More Telugu News