అల్పపీడనంపై ఐఎండీ అప్‌డేట్... ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

  • బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం
  • ఏపీలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు
  • ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
  • మరో 8 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానల సూచన
  • సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరిక
బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో మంగళవారం, బుధవారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది.

విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే, శుక్రవారం మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

మరోవైపు, ఏపీఎస్డీఎంఏ కూడా అల్పపీడనంపై అంచనాలు వెలువరించింది. ఈశాన్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మయన్మార్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

రేపు విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ వివరించింది. 


More Telugu News