Nitin Gadkari: ప్రజలను మోసం చేసేవాళ్లే గొప్ప లీడర్లు: నితిన్ గడ్కరీ

Nitin Gadkari Says Those Who Deceive People Are Great Leaders
  • రాజకీయాలపై మరోసారి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
  • తాను పనిచేసే రంగంలో నిజం మాట్లాడటం నిషిద్ధమని వ్యాఖ్య
  • షార్ట్‌కట్‌లు జీవితాన్ని షార్ట్‌గా కట్ చేస్తాయని ప్రజలకు హితవు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి రాజకీయాలపై తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసం చేసేవారినే గొప్ప నాయకులుగా పరిగణిస్తారని, తాను పనిచేసే రంగంలో మనస్ఫూర్తిగా నిజం మాట్లాడటం నిషిద్ధమని అన్నారు. నిర్మొహమాటంగా మాట్లాడతారనే పేరున్న గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

వివరాల్లోకి వెళితే, నాగ్‌పూర్‌లో 'అఖిల భారత మహానుభావ పరిషత్తు' నిర్వహించిన ఒక కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవితంలో విజయం సాధించడానికి అడ్డదారులను ఎంచుకోవద్దని ప్రజలకు సూచించారు. "ఏదైనా సాధించడానికి ఒక షార్ట్‌ కట్ ఉంటుంది. కానీ, మీరు షార్ట్‌ కట్ వాడితే, అది మిమ్మల్ని షార్ట్‌గా కట్ చేస్తుంది. అందుకే నిజాయతీ, విశ్వసనీయత వంటి విలువలను పాటించాలి" అని ఆయన హితవు పలికారు.

సమాజంలో నిజం, అంకితభావం వంటి విలువలు దీర్ఘకాలిక విజయాన్ని అందిస్తాయని గడ్కరీ పేర్కొన్నారు. అంతిమంగా నిజమే గెలుస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాలపై తన మార్క్ సెటైర్లు వేశారు.

గడ్కరీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టులను ఆశ్రయించడం వల్లే పరిపాలనలో క్రమశిక్షణ పెరుగుతోందని అన్నారు. మంత్రులు చేయలేని పనులను న్యాయస్థానాలు చేయిస్తాయని అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంచి పనులు చేసే నేతలకు గౌరవం, చెడు పనులు చేసేవారికి శిక్షలు ఉండవని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. 
Nitin Gadkari
Nitin Gadkari comments
political leaders
corruption
dishonesty
Nagpur
Bhagavad Gita
political ethics
Indian politics
Akhil Bharatiya Mahanubhav Parishad

More Telugu News