Srikanth: బిడ్డకు నామకరణం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య

Anantapur Software Engineer Srikanth Killed in Commission Row
  • శ్రీ సత్యసాయి జిల్లా తలుపులలో జరిగిన ఘటన
  • ఇటీవలే తండ్రైన శ్రీకాంత్ 
  • కత్తితో తొడపై పొడవడంతో తీవ్ర రక్తస్రావం
  • ప్రధాన నిందితుడు పరారీ
  • ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఓ చిన్న లోన్ కమీషన్ గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇటీవలే తండ్రైన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్యకు గురయ్యాడు. బిడ్డకు నామకరణం చేయాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం అలముకుంది. పోలీసుల కథనం ప్రకారం తలుపుల మండలానికి చెందిన శ్రీకాంత్ (30) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఈ దాడిలో మరణించాడు. శనివారం అర్ధరాత్రి దాదాపు 12:30 గంటల సమయంలో ఈ హత్య జరిగింది. లోన్ కమీషన్ విషయంలో తలెత్తిన వివాదంలో రాజారాం అనే వ్యక్తి కత్తితో శ్రీకాంత్ తొడపై బలంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతడిని కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

శ్రీకాంత్ బావమరిది అయిన అనిరుధ్ బ్యాంకుల్లో రుణాలు ఇప్పిస్తుంటాడు. బలిజపేటకు చెందిన శోభ అనే మహిళకు రుణం ఇప్పించాలని రాజారాం, ఆమెను అనిరుధ్‌కు పరిచయం చేశాడు. ఆ రుణం మంజూరైన తర్వాత తనకు కమీషన్ ఇవ్వాలంటూ రాజారాం పట్టుబట్టాడు. ఈ విషయమై మాటామాటా పెరగడంతో శనివారం రాత్రి రాజారాం.. అనిరుధ్ ఇంటికెళ్లి అతని బైక్‌ను ధ్వంసం చేశాడు.

విషయం తెలుసుకున్న అనిరుధ్, అతని తండ్రి శ్రీనివాసులు, బావమరిది శ్రీకాంత్‌తో కలిసి రాజారాంను నిలదీసేందుకు అతని ఇంటికి వెళ్లారు. అయితే, తనపై దాడికి వస్తున్నారనే భయంతో రాజారాం ముందుగానే సిద్ధం చేసుకున్న కత్తితో శ్రీకాంత్‌పై దాడి చేశాడు. ఈ గొడవలో అనిరుధ్, శ్రీనివాసులకు కూడా గాయాలయ్యాయి. ఘటన అనంతరం ప్రధాన నిందితుడు రాజారాం పరారీలో ఉండగా, అతనికి సహకరించారన్న ఆరోపణలపై తండ్రి వెంకటరాయప్ప, తరుణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై నరసింహుడు వెల్లడించారు.

కుటుంబంలో తీవ్ర విషాదం
బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న శ్రీకాంత్ తలుపుల మండల పరిషత్ కార్యాలయంలో పంపు మెకానిక్‌గా పనిచేస్తున్న కృష్ణయ్యకు ఒక్కగానొక్క కుమారుడు. శ్రీకాంత్‌కు ఇటీవలే కుమారుడు జన్మించాడు. బిడ్డకు నామకరణం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ఈ ఘోరం జరగడంతో కుటుంబంలో, గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Srikanth
Software Engineer Murder
Sathya Sai District Crime
Loan Commission Dispute
Kadiri Hospital Death
Rajaram Accused
Andhra Pradesh News
Crime News Andhra Pradesh
Tadipatri News
Anirudh Loan Issue

More Telugu News