KCR: కాళేశ్వరం అక్రమాలకు కేసీఆరే బాధ్యులు.. ఆయనపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ ఉంది: ఉత్తమ్

KCR Responsible for Kaleshwaram Irregularities Says Uttam Kumar Reddy
  • అసెంబ్లీలో కాళేశ్వరంపై 665 పేజీల ఘోష్ కమిషన్ నివేదిక సమర్పణ
  • కేసీఆర్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచన
  • ప్రపంచంలోనే అతిపెద్ద మానవ తప్పిదమన్న మంత్రి ఉత్తమ్
  • ప్రాజెక్టు నిర్వహణ కూడా పెనుభారంగా మారిందని విమర్శ   
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన భారీ తప్పిదాలు, అక్రమాలకు గత ప్రభుత్వ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే పూర్తి బాధ్యత వహించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుపై విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పిందని, కేసీఆర్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించిందని, ఆయనపై చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఆదివారం శాసనసభలో 665 పేజీల ఘోష్ కమిషన్ నివేదికను ఆయన సభ ముందు ఉంచారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. నిపుణుల సూచనలను పెడచెవిన పెట్టి, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతులు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిందని కమిషన్ నివేదికలో పేర్కొన్నట్లు తెలిపారు. "కేసీఆర్ చెప్పినట్లే చేశాం" అని అధికారులు సైతం వాంగ్మూలం ఇచ్చారని, నిబంధనలకు విరుద్ధంగా కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే పనులు అప్పగించారని ఆయన ఆరోపించారు. ఈ అక్రమాలకు పాల్పడిన నాటి నేతలు, అధికారులు, ఇంజనీర్ల వివరాలను కూడా కమిషన్ స్పష్టంగా తెలిపిందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచంలోనే అతిపెద్ద మానవ తప్పిదమని ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో సుమారు రూ.21 వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయని అన్నారు. గత 20 నెలలుగా మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిరుపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రూ.38,500 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును అకారణంగా రద్దు చేసి, లక్ష కోట్లకు పైగా అంచనాలతో కాళేశ్వరం చేపట్టారని ఉత్తమ్ గుర్తు చేశారు. ఐదేళ్లలో 195 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని చెప్పి, కేవలం 125 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారని, అందులో వాడుకున్నది 101 టీఎంసీలేనని వివరించారు. ప్రాజెక్టు నిర్వహణ కూడా పెనుభారంగా మారిందని, ఒక్క విద్యుత్ శాఖకే రూ.9,735 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. 
KCR
Kaleshwaram project
Uttam Kumar Reddy
PC Ghosh Commission
Telangana irrigation
Medigadda barrage
corruption allegations
BRS government
irrigation project
Pranahita Chevella

More Telugu News