Andhra Pradesh Rains: ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు

 Heavy Rainfall Alert for Andhra Pradesh
  • వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం
  • రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ 
  • గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచన
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతం మీదుగా 1.5-1.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రేపు (సెప్టెంబర్ 2) బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ఫలితంగా తూర్పు గాలులు బలంగా వీచే అవకాశం ఉండటంతో పాటు తీర ప్రాంతాల్లో వర్షాలు మళ్లీ పెరగనున్నాయన్నారు.

ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

తీరం వెంబడి గంటకు 40–60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సరఫరా అంతరాయం, వరదల ప్రమాదాలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. 
Andhra Pradesh Rains
AP Weather
Heavy Rainfall
IMD Forecast
Cyclone Alert
Bay of Bengal
Weather Warnings
Coastal Andhra
Rainfall Alert
Low Pressure

More Telugu News