Nadendla Manohar: ఇంటింటికీ స్మార్ట్ రేషన్ కార్డులు.. తెనాలిలో స్వయంగా అందించిన మంత్రి నాదెండ్ల

Nadendla Manohar Distributes Smart Ration Cards in Tenali
  • తెనాలి నియోజకవర్గం నందివెలుగులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం
  • రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్ల కుటుంబాలకు కొత్త కార్డుల పంపిణీ లక్ష్యం
  • సెప్టెంబర్ 15లోగా ఇంటింటికీ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామన్న మంత్రి నాదెండ్ల
  • క్యూఆర్ కోడ్, పోర్టబులిటీ సౌకర్యాలతో ఆధునిక సాంకేతికతతో కార్డులు
  • అభివృద్ధి, సంక్షేమంలో కూటమి ప్రభుత్వం ముందుందని తెలిపిన కేంద్ర మంత్రి పెమ్మసాని
  • ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల హామీని అమలు చేస్తున్నామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, ఆధునికంగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 1.46 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని నందివెలుగు గ్రామంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి మంత్రులు స్మార్ట్ కార్డులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 15వ తేదీలోగా ప్రతి ఇంటికీ స్మార్ట్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్డుల ద్వారా రాష్ట్రంలోని సుమారు నాలుగు కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు. గుంటూరు జిల్లాలో 5.85 లక్షల మందికి, ఒక్క తెనాలి నియోజకవర్గంలోనే 83 వేల మందికి ఈ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ సౌకర్యంతో కూడిన ఈ కార్డును స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుడు సరుకులు తీసుకున్న వివరాలు వెంటనే ప్రభుత్వానికి చేరుతాయని, దీనివల్ల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని అన్నారు. పోర్టబులిటీ విధానం ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించామని గుర్తుచేశారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మనోహర్ తెలిపారు. దీపం-2 పథకం కింద మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీని నిలబెట్టుకుంటున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా పార్టీలకు అతీతంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ దుష్ట ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. రేషన్ పంపిణీకి సంబంధించి ఏమైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఫోన్ చేయవచ్చని సూచించారు.

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ రేషన్ కార్డులను అమలు చేయడం గర్వకారణమన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. రూ.4 వేల పెన్షన్, తల్లికి వందనం కింద రూ.10 వేల కోట్లు, అన్నదాత సుఖీభవ ద్వారా రూ.3,175 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. అమరావతి, పోలవరం పనులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఎన్నికల ముందు నందివెలుగు గ్రామానికి రావడానికి రోడ్లు అధ్వానంగా ఉండేవని, ఇప్పుడు తాము వేసిన రోడ్లతో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
Nadendla Manohar
Andhra Pradesh
Smart Ration Cards
AP Ration Card
Pemmasani Chandrasekhar
TDP
Janasena
Nandivelugu
Tenali
Public Distribution System

More Telugu News