India: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి ఉక్రెయిన్ కు ఎగుమతి చేస్తున్న భారత్!

India Supplying Diesel to Ukraine After Buying Russian Oil
  • ఉక్రెయిన్‌కు డీజిల్ సరఫరాలో అగ్రస్థానానికి చేరిన భారత్
  • జులైలో 15.5 శాతం ఇంధనం భారత్ నుంచే దిగుమతి
  • రష్యా నుంచి కొన్న ముడి చమురునే శుద్ధి చేసి సరఫరా
  • గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిన భారత డీజిల్ ఎగుమతులు
  • రొమానియా, తుర్కియేల మీదుగా ఉక్రెయిన్‌కు ఇంధన రవాణా
  • అమెరికాలోని ఓ వర్గం విమర్శిస్తున్నా కొనసాగుతున్న సరఫరా
ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో భారత్ వైఖరిని అమెరికా నిందిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్ పై పోరాడేందుకు అవససరమైన డబ్బును ఆ దేశానికి అందిస్తోందని అమెరికా కన్నెర్ర చేస్తోంది. అగ్రరాజ్యం ఇప్పటికే అదనపు సుంకంతో కలిపి భారత్ పై 50 శాతం సుంకాలు విధించింది. ఈ నేపథ్యంలో, అత్యంత ఆసక్తికరమైన అంశం వెల్లడైంది. భారత్ ఒకవైపు రష్యా నుంచి భారీగా ముడి చమురును కొనుగోలు చేస్తూనే, మరోవైపు అదే చమురును శుద్ధి చేసి యుద్ధంతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌కు అతిపెద్ద డీజిల్ సరఫరాదారుగా నిలిచింది. అమెరికాలోని కొందరు విమర్శిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థకు, సైనిక అవసరాలకు భారత ఇంధనమే కీలకంగా మారింది.

ఉక్రెయిన్‌కు చెందిన చమురు మార్కెట్ విశ్లేషణ సంస్థ ‘నాఫ్టోరైనోక్’ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025 జులై నెలలో ఉక్రెయిన్‌కు అత్యధికంగా డీజిల్ సరఫరా చేసిన దేశంగా భారత్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ నెలలో ఉక్రెయిన్ వినియోగించిన మొత్తం డీజిల్‌లో 15.5 శాతం వాటా భారత్‌దే కావడం గమనార్హం. సగటున రోజుకు 2,700 టన్నుల డీజిల్‌ను భారత్ నుంచి ఉక్రెయిన్ దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు ఉక్రెయిన్‌కు భారత డీజిల్ ఎగుమతులు 10.2 శాతానికి పెరిగాయి. 2024లో ఇదే కాలంలో ఇది కేవలం 1.9 శాతంగా మాత్రమే ఉంది.

భారత్ నుంచి శుద్ధి చేసిన ఈ డీజిల్ రొమానియా, తుర్కియే దేశాల ద్వారా ఉక్రెయిన్‌కు చేరుతోంది. యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్ నగరాలు, రవాణా వ్యవస్థ, యుద్ధ క్షేత్రాలు నడవడానికి ఈ ఇంధన సరఫరా అత్యంత కీలకంగా మారింది. భారత్‌తో పాటు స్లొవాకియా, గ్రీస్, తుర్కియే, లిథువేనియా వంటి దేశాలు కూడా ఉక్రెయిన్‌కు ఇంధనాన్ని అందిస్తున్నాయి.

అయితే, అమెరికాలోని ట్రంప్ కార్యవర్గానికి చెందిన పీటర్ నవారో వంటి కొందరు, రష్యా నుంచి చమురు కొనడం ద్వారా భారత్ యుద్ధాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. కానీ, అదే రష్యా చమురుతో నడుస్తున్న ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తోంది. గతంలో అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్, వెనుజువెలా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసిన భారత్, ఇప్పుడు రష్యా విషయంలో కూడా అదే పనిచేస్తే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
India
Russia Ukraine war
Ukraine
Russian oil
diesel supply
Indian oil exports
NaftoRynok
Peter Navarro
oil imports
energy

More Telugu News