Narendra Modi: చైనాతో స్నేహమా?.. మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్

Congress Fires at Modi Government on China Relations
  • టియాంజిన్‌లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భేటీ
  • చైనా పట్ల కేంద్రం మెతక వైఖరి అవలంబిస్తోందని కాంగ్రెస్ ఆగ్రహం
  • సరిహద్దుల్లో చైనా దురాక్రమణను చట్టబద్ధం చేస్తున్నారని ఆరోపణ
  • గల్వాన్ వీరుల త్యాగాలను ప్రభుత్వం విస్మరించిందని జైరాం రమేశ్ విమర్శ
  • చైనా వస్తువుల డంపింగ్, హైడల్ ప్రాజెక్టుపై ప్రభుత్వ మౌనాన్ని నిలదీత
  • చైనా దూకుడుకు తలొగ్గడం కొత్త భద్రతా విధానమా అని ప్రశ్న
ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య ఆదివారం టియాంజిన్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిగిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. చైనా పట్ల మోదీ సర్కార్ అనుసరిస్తున్న మెతక వైఖరిని ఎండగడుతూ, దేశ భద్రత విషయంలో రాజీ పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. చైనా దూకుడుకు, బెదిరింపులకు తలొగ్గడమే భారత కొత్త భద్రతా విధానమా అని సూటిగా ప్రశ్నించింది.

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ 'ఎక్స్' వేదికగా ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులు ప్రాణత్యాగం చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఆ త్యాగాలను విస్మరించి చైనాతో రాజీకి ప్రయత్నించడం దారుణమని విమర్శించారు. "చైనా దురాక్రమణను గుర్తించడానికి బదులుగా, ప్రధాని మోదీ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు" అని ఆయన ఆరోపించారు. సరిహద్దుల్లో యథాతథ స్థితిని పూర్తిగా పునరుద్ధరించాలని ఆర్మీ చీఫ్ కోరుతున్నప్పటికీ, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకుండా చైనాతో సయోధ్యకు మొగ్గుచూపడం వారి దురాక్రమణను చట్టబద్ధం చేయడమేనని అన్నారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌తో చైనా కుమ్మక్కైన తీరును మన ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ జూలై 4న స్పష్టంగా వివరించారని జైరాం రమేశ్ గుర్తుచేశారు. "ఈ అపవిత్ర పొత్తుపై స్పందించాల్సింది పోయి, మోదీ ప్రభుత్వం దానిని మౌనంగా అంగీకరించి ఇప్పుడు చైనాకు రాచమర్యాదలు చేస్తోంది" అని ఆయన ఆక్షేపించారు.

దేశీయంగా చైనా ఉత్పత్తుల డంపింగ్ విపరీతంగా పెరిగిపోయిందని, దీనివల్ల దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME) తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యార్లంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై చైనా నిర్మిస్తున్న భారీ హైడల్ ప్రాజెక్టు వల్ల ఈశాన్య రాష్ట్రాలకు తీవ్ర ముప్పు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. 

కాగా, ఇరు దేశాల మధ్య ఆర్థిక పురోగతి కోసం స్థిరమైన, స్నేహపూర్వక సంబంధాలను నిర్మించుకోవాలని మోదీ, జిన్‌పింగ్ తమ భేటీలో నిర్ణయించుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Narendra Modi
China
India China relations
Xi Jinping
Congress party
border dispute
Galwan Valley
economic relations
military
JaiRam Ramesh

More Telugu News