Jawaharlal Nehru: నెహ్రూ కలలుగన్న శాంతి ఒప్పందం.. భారత్-చైనా సంబంధాల్లో కీలక అధ్యాయం

Jawaharlal Nehrus Panchsheel Agreement A Key Chapter in India China Relations
  • 70 ఏళ్ల క్రితం చైనాలో తొలి భారత ప్రధాని నెహ్రూ చారిత్రక పర్యటన
  •  1954లో భారత్-చైనా మధ్య ఐదు సూత్రాలతో పంచశీల ఒప్పందం
  •  ఒప్పందంలో భాగంగా టిబెట్‌పై చైనా సార్వభౌమత్వాన్ని అంగీకరించిన భారత్
  •  అప్పట్లోనే సరిహద్దు మార్గాలపై ఇరు దేశాల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు
  •  ఒప్పందం ముగిసిన కొద్ది నెలలకే 1962లో యుద్ధానికి దారితీసిన వివాదాలు
భారత్-చైనా సంబంధాల గురించి చర్ల వచ్చినప్పుడల్లా 'పంచశీల ఒప్పందం' ప్రస్తావనకు వస్తుంది. 'హిందీ-చీనీ భాయ్ భాయ్' నినాదాలతో స్నేహానికి ప్రతీకగా మొదలైన ఈ ఒప్పందం, చివరికి రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీయడం ఒక చారిత్రక విషాదం. సుమారు 70 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఒప్పందం వెనుక ఎన్నో ఆశలు, రాజీలు, ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఉన్నాయి.

చైనాలో నెహ్రూ చారిత్రక పర్యటన
1954లో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చైనాలో పర్యటించారు. మావో జెడాంగ్ నేతృత్వంలో చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఆ దేశాన్ని సందర్శించిన తొలి కమ్యూనిస్టేతర నేత నెహ్రూనే. తన కుమార్తె ఇందిరా గాంధీతో కలిసి చైనాకు వెళ్లిన ఆయనకు చైనా ప్రభుత్వం అపూర్వ స్వాగతం పలికింది. బీజింగ్, షాంఘై వంటి నగరాల్లో పర్యటించిన నెహ్రూ.. అమెరికా, సోవియట్ యూనియన్ కూటములతో సంబంధం లేకుండా ఆసియా దేశాల మధ్య శాంతియుత సంబంధాలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య కొత్త స్నేహానికి నాంది పలుకుతుందని ఆయన బలంగా విశ్వసించారు.

ఐదు సూత్రాలతో ఒప్పందం
నెహ్రూ పర్యటనకు రెండు నెలల ముందు, అంటే 1954 ఏప్రిల్ 29న, టిబెట్ ఒప్పందంలో భాగంగా భారత్-చైనా మధ్య పంచశీల ఒప్పందం కుదిరింది. భారత రాయబారి ఎన్. రాఘవన్, చైనా ప్రతినిధి చాంగ్ హన్-ఫు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. 

ఈ ఒప్పందంలోని ఐదు ప్రధాన సూత్రాలు
  •  ఒకరి సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను మరొకరు గౌరవించుకోవడం.
  • పరస్పరం దురాక్రమణలకు పాల్పడకపోవడం.
  • ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకపోవడం.
  • సమానత్వం, పరస్పర ప్రయోజనాల కోసం పనిచేయడం.
  • శాంతియుత సహజీవనం.

అయితే, ఈ ఒప్పందంలో భారత్ ఒక చారిత్రక రాజీకి తలొగ్గాల్సి వచ్చింది. టిబెట్‌ను "చైనాలోని టిబెట్ ప్రాంతం"గా అంగీకరించి, దానిపై చైనా సార్వభౌమత్వాన్ని అధికారికంగా గుర్తించింది.

తెరవెనుక భేదాభిప్రాయాలు.. చివరికి యుద్ధం
శాంతి మంత్రంలా కనిపించిన ఈ ఒప్పందం వెనుక చర్చల సమయంలోనే తీవ్ర భేదాభిప్రాయాలు తలెత్తాయి. ముఖ్యంగా హిమాలయాల్లోని వ్యాపార, యాత్రా మార్గాల విషయంలో చైనా మొండిగా వ్యవహరించింది. భారత్ ప్రతిపాదించిన పలు సరిహద్దు మార్గాలను తిరస్కరించింది. లఢక్‌లోని డెమ్‌చోక్ మార్గాన్ని చేర్చాలన్న భారత అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది.

ఈ ఒప్పందం 1962 జూన్‌లో ముగిసింది. ఆ తర్వాత కొద్ది నెలలకే అక్సాయి చిన్, మెక్‌మహాన్ లైన్ వంటి సరిహద్దు ప్రాంతాలపై వివాదాలు ముదిరి రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధానికి దారితీశాయి. దీంతో పంచశీల సూత్రాలు కాగితాలకే పరిమితమై, ఇరు దేశాల సంబంధాల్లో తీవ్రమైన అపనమ్మకానికి బీజం పడింది.
Jawaharlal Nehru
Panchsheel Agreement
India China relations
Hindi-Chini bhai bhai
China visit
Tibet agreement
Sino Indian War
India foreign policy
history

More Telugu News