Revanth Reddy: బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్సే అడ్డంకి.. సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy Slams BRS for Obstructing BC Reservations
  • బీసీ బిల్లులు 5 నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్న సీఎం
  • కేసీఆర్ తెచ్చిన పాత చట్టాలే రిజర్వేషన్లకు గుదిబండగా మారాయన్న రేవంత్‌రెడ్డి
  •  మా ఆర్డినెన్స్‌ను కూడా గవర్నర్ రాష్ట్రపతికి పంపారని వెల్లడి
  • ఢిల్లీ ధర్నాకు బీఆర్ఎస్ ఎంపీలు కన్నెత్తి చూడలేదని విమర్శ
  • సభలో బిల్లును అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆగ్రహం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అడ్డుపడుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పురపాలక, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, గవర్నర్ తీరు కారణంగానే జాప్యం జరుగుతోందని ఆయన విమర్శించారు.

గతంలో తమ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపిందని రేవంత్ గుర్తుచేశారు. అయితే, గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపారని, సుమారు 5 నెలలుగా ఆ బిల్లులు అక్కడే ఉన్నాయని తెలిపారు. "గత ప్రభుత్వం 2018, 2019లో తెచ్చిన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు రిజర్వేషన్లకు గుదిబండగా మారాయి. వాటిని సవరించేందుకు ఆర్డినెన్స్ తీసుకొస్తే, దానిని కూడా గవర్నర్ రాష్ట్రపతికి పంపారు" అని సీఎం వివరించారు.

ఈ విషయంపై ప్రధానిపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే, బీఆర్ఎస్ ఎంపీలు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని రేవంత్ విమర్శించారు. "బీసీల గురించి మాట్లాడుతున్న గంగుల కమలాకర్ కూడా ఆ ధర్నాకు రాలేదు. వాళ్ల పార్టీ నాయకుడికి బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు. ఇప్పుడు కూడా సభలో గందరగోళం సృష్టిస్తూ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు" అని ఆరోపించారు.

ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీఆర్ఎస్ నేతలు సహకరించాలని, లేదంటే భవిష్యత్తులో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
Revanth Reddy
BC Reservations
Telangana
BRS Party
Local Body Elections
High Court
Gangula Kamalakar
Telangana Politics
Reservation Bill

More Telugu News