Nandamuri Balakrishna: పదేళ్ల వయసులోనే కృష్ణుడిలా.. బాలయ్య సీక్రెట్ చెప్పిన దగ్గుబాటి

Balakrishna as Krishna at 10 Says Daggubati
  • గౌతమీపుత్ర శాతకర్ణిగా ఎన్టీఆర్ కన్నా బాలయ్యే గొప్పగా చేశారని దగ్గుబాటి ప్రశంస
  • అఖండ, లెజెండ్ కన్నా ఆ చారిత్రక చిత్రమే తనకు బాగా నచ్చిందని వెల్లడి
  • పదేళ్ల వయసులోనే శ్రీకృష్ణుడి డైలాగులతో ఆశ్చర్యపరిచాడని చిన్ననాటి జ్ఞాపకాలు
  • ఇక నెక్స్ట్ జనరేషన్‌కు అవకాశం ఇవ్వాలంటూ సరదాగా వ్యాఖ్య
నందమూరి బాలకృష్ణ నటన పట్ల, ముఖ్యంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంలో ఆయన అభినయం పట్ల మాజీ మంత్రి, బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రశంసలు కురిపించారు. ఆ చారిత్రక పాత్రలో స్వర్గీయ ఎన్టీ రామారావు నటించినా కూడా బహుశా అంత గొప్పగా చేయలేరేమో అనిపించిందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ సినీ ప్రస్థానంపై మాట్లాడిన ఆయన పలు వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకున్నారు.

ఓ కార్యక్రమంలో మాట్లాడిన దగ్గుబాటి, తనకు బాలయ్య చిత్రాల్లో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అంటే చాలా ఇష్టమని తెలిపారు. "చాలామంది నరసింహనాయుడు, అఖండ, లెజెండ్ వంటి సినిమాల గురించి చెబుతారు. కానీ నాకు మాత్రం గౌతమీపుత్ర శాతకర్ణి బాగా నచ్చింది. ఎందుకంటే అది 2000 ఏళ్ల క్రితం నాటి ఒక చారిత్రక పాత్ర. ఆ పాత్రలోకి బాలకృష్ణ పరకాయ ప్రవేశం చేశారు. ఆయనే శాతకర్ణిగా మళ్లీ పుట్టారా అన్నంత అద్భుతంగా నటించారు. ఈ మాట చెబితే కొంచెం ఎక్కువ అవుతుందేమో కానీ, బహుశా ఎన్టీఆర్ గారు ఆ పాత్ర వేసినా ఈ స్థాయిలో ఉండేది కాదేమో అనిపించింది" అని ఆయన వివరించారు.

బాలకృష్ణ విజయ రహస్యం ఆయన పట్టుదలే అని దగ్గుబాటి అన్నారు. "బాలయ్యా, నీలో ఇంత పట్టుదల ఎలా వస్తుంది అని నేను అడిగాను. దానికి ఆయన తెల్లవారుజామున 3 గంటలకే లేచి డైలాగులు వల్లె వేస్తానని, అవసరమైతే బాత్రూంలో కూడా ప్రాక్టీస్ చేస్తానని సరదాగా బదులిచ్చాడు" అని గుర్తుచేసుకున్నారు. 50 ఏళ్లుగా ఒకే స్థాయిలో పరిశ్రమలో నిలబడటం వెనుక అపారమైన కృషి, దీక్ష ఉన్నాయని కొనియాడారు.

తన చిన్ననాటి జ్ఞాపకాలను కూడా దగ్గుబాటి పంచుకున్నారు. "బాలయ్యకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు నీలం నిక్కరు వేసుకుని చాలా ముద్దుగా ఉండేవాడు. అప్పుడే ఓ ఆయాను సత్యభామగా చేసి, తాను శ్రీకృష్ణుడిలా డైలాగులు చెప్పడం చూశాను. అతనిలో కళా అంశం ఉందని, భవిష్యత్తులో గొప్ప నటుడు అవుతాడని అప్పుడే ఊహించాను" అని తెలిపారు. ప్రసంగం చివర్లో "50 ఏళ్లు పూర్తయ్యాయి కదా, ఇక నెక్స్ట్ జనరేషన్‌కు అవకాశం ఇవ్వండి" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
Nandamuri Balakrishna
Balakrishna
Gautamiputra Satakarni
Daggubati Venkateswara Rao
NTR
Telugu cinema
Tollywood
historical movies
Akhanda
acting

More Telugu News